Masala Dosa: కప్పుడు సాంబార్ కి కక్కుర్తి పడి..

Masala Dosa: కప్పుడు సాంబార్ కి కక్కుర్తి పడి..
రూ.3500 ఫైన్ కట్టిన హోటల్

అవసరం పడో, అవకాశం లేకో, సరదాకో కారణం ఏదైనా ఈ రోజుల్లో హోటల్లో టిఫిన్ చెయ్యడం చాలా సాధారణం. తీరా వెళ్ళాక టిఫిన్లలో చట్నీ లేదనో, సాంబార్ లేదనో ఆ హోటల్‌ వాళ్ళు చెప్పడం కూడా అప్పుడప్పుడు జరిగేదే. అయితే చాలా మంది పోనీలే పర్లేదు అని వదిలేస్తూ ఉంటారు. కానీ మసాలా దోశకు సాంబార్ ఇవ్వలేదని.. ఓ కస్టమర్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చివరికి ఆ హోటల్‌దే తప్పు అని తేల్చిన కమిషన్.. రెస్టారెంట్‌కు ఫైన్ వేసింది.

మనం ఏదైనా వస్తువు కొన్నపుడు వినియోగదారులుగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు భంగం కలిగిస్తే మనం ఫిర్యాదు చేసేందుకు వినియోగదారుల కమిషన్ కూడా ఉంటుంది. ఈ విషయం మనకు చూచాయిగా తెలుసు కానీ అబ్బా అంత ఆలోచించడం ఎందుకు అని వదిలేసేవారే ఎక్కువ. కానీ ఓ కస్టమర్ మాత్రం.. పట్టుబట్టి తనకు రావాల్సిన దాని కోసం పోరాడాడు. చివరికి విజయం సాధించాడు.


బిహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది.. తన తల్లితో కలిసి టిఫిన్ చేయడానికి ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ రూ. 140 ఇచ్చి మసాలా దోశను పార్సిల్ చేయించుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి చూసే సరికి ఆ పార్సిల్‌లో కేవలం దోశ, చట్నీ మాత్రమే ఉంది. సాంబార్ లేకపోవడంతో మరుసటి రోజు మనీష్ పాఠక్ అదే రెస్టారెంట్‌కు వెళ్లారు. ముందు రోజు తీసుకెళ్లిన మసాలా దోశ పార్సిల్‌లో చట్నీతో పాటు సాంబార్ ఇవ్వలేదని రెస్టారెంట్ నిర్వాహకులను మనీష్ కు ఆ రెస్టారెంట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. హేళన చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మనీష్ తాను స్వయంగా న్యాయవాది కనుక రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు పంపించారు.

అయితే మనీష్ పంపించిన నోటీసులకు సదరు రెస్టారెంట్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై జిల్లా వినియోగదారుల కమిషన్ విచారణ చేసింది. చివరకు 11 నెలల తర్వాత మసాలా దోశతోపాటు సాంబార్ ఇవ్వకపోవడం రెస్టారెంట్‌ తప్పిదమేనని ఆ కోర్టు నిర్ధారణకు వచ్చింది. పైగా ప్రశ్నించిన కస్టమర్‌పై అనుచితంగా ప్రవర్తించినట్లు గుర్తించింది. కస్టమర్‌ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినందుకు రూ.2000, లిటిగేషన్‌ ఛార్జీల కింద మరో రూ. 1500 జరిమానా విధించింది. దీంతో మొత్తం ఫైన్ రూ. 3500 కు చేరుకుంది. ఈ జరిమానాను తీర్పు ఇచ్చిన 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో రూ. 3500 కు 8 శాతం వడ్డీ యాడ్ అవుతుందని కూడా చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story