RAINS: ఉత్తరాదిలో జల విలయం

RAINS: ఉత్తరాదిలో జల విలయం
దేశ రాజధాని సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి.... ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు....కాగితం పడవల్లా కొట్టుకుపోయిన కార్లు.. జన జీవనం అస్తవ్యస్తం

దేశ రాజధాని సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల ధాటికి అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి రోడ్డు, రైలు రవాణా స్తంభించింది. కొండచరియలు విరిగిపడటం, ఇతర ఘటనలలో మృతుల సంఖ్య 28కు చేరింది. అందులో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు దాటిందని కేంద్ర జలసంఘం తెలిపింది.


దేశ రాజధానిలో నిన్న రాత్రి ఎనిమిదిన్నర వరకు 260 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో 1982 తర్వాత ఒక్కరోజు అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని సీఎం కేజ్రీవాల్‌ ఆదేశించారు.


హిమాచల్, ఉత్తరాఖండ్, దిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడ్డాఖ్‌లలో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కరుస్తాయని IMD హెచ్చరించింది. హిమాచల్ లో 10జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బియాస్ నది నీటిమట్టం పెరగడంతో నాగవాయిలో ఆరుగురు చిక్కుకోగా.. అర్ధరాత్రి సహాయక చర్యలు చేప్టటి వారిని రక్షించారు. లేహ్-మనాలి హైవే ధ్వంసమైంది. వర్ష ప్రభావి రాష్ట్రాల్లో అనేక రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రికార్డు వర్షాల నేపథ్యంలో రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు.


హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. బియాస్‌ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సిమ్లా-కల్కా మార్గంలో అన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న దృష్ట్యా 700 రహదారులను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. హరియాణా, పంజాబ్‌లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో..పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొహలీలో డేరా బస్సీ గుల్‌మోహర్‌ సొసైటీలో ఒక అంతస్తు వరకూ వరద నీరు చేరింది. సెల్లార్లలో పార్కింగ్‌ చేసిన వాహనాలు నీట మునిగాయి. జమ్ముకశ్మీర్ లోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. చీనాబ్, రావి సహా అన్ని నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దోడా జిల్లాలో ప్రయాణికుల బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story