Gujarat Riots : సిట్ అఫిడవిట్‌.. దేశ రాజకీయాల్లో రాజుకుంటున్న చిచ్చు..

Gujarat Riots : సిట్ అఫిడవిట్‌.. దేశ రాజకీయాల్లో రాజుకుంటున్న చిచ్చు..
Gujarat Riots : గోద్రా అల్లర్ల ప్రకంపనలు దేశంలో ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీల మధ్య అగ్గిరాజేస్తూనే ఉన్నాయి.

Gujarat Riots : గోద్రా అల్లర్ల ప్రకంపనలు దేశంలో ఇంకా చల్లారడం లేదు. రాజకీయ పార్టీల మధ్య అగ్గిరాజేస్తూనే ఉన్నాయి. కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చినా.. వదిలిపెట్టడం లేదు. ఏదో ఒక కూపీ లాగుతూ ప్రత్యర్థి పార్టీలపై నిందలు, ఆరోపణలు చూస్తూనే ఉన్నారు. తాజాగా సిట్ దాఖలు చేసిన అఫిడవిట్ దేశ రాజకీయాల్లో అలజడి రేపుతోంది.

గుజరాత్ లో 20ఏళ్ల క్రితం జరిగిన గోద్రా అల్లర్లు.. దేశ రాజకీయాలను కబలిస్తూనే ఉన్నాయి. 2002లో గుజరాత్ లో గోద్రా అల్లర్లు చెలరేగినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్.. గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. దీంతో గోద్ర అల్లర్ల నిందలను ఒకరిపై ఒకరు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు.

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ సహా 62 మందికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ దివంగత ఎంపీ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఆరోపించారు. ఈ కేసులో పునర్విభజన జరపాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

కోర్టు స్పందించిన మరుసటి రోజే అమాయకులను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారంటూ తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు సిట్ దాఖలు చేసిన అఫిడవిట్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పటి సీఎం మోడీని, అమాయకప్రజలను ఇరికించేందుకు దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్ర చేశారని సిట్ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు తీస్తా సహాకారం తీసుకున్నారని సిట్ ఆరోపిస్తోంది.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో సోనియాగాంధీకి అహ్మద్ పటేల్ సలహాదారుడిగా ఉన్నారు. అంటే సోనియాగాంధీ సూచన మేరకే గుజరాత్ లో కుట్ర జరిగిందనే వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.

అయితే సిట్ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రధాని మోడీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. రాజకీయ లబ్ధికోసం చనిపోయిన నేతలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ నేతలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని విమర్శించారు. ప్రధాని తన మీద ఉన్న మచ్చను చెరిపేసి కాంగ్రెస్ పై నిందలు వేయడానికి మోడీ వ్యూహరచన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మరోవైపు పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ కూడా సిట్ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇంతటి పెద్ద కుట్రలో తన తండ్రి భాగమైతే.. ప్రాణాలతో ఉన్నప్పుడు ఆయన్ను ఎందుకు విచారించలేదని సూటిగా ప్రశ్నించారు.

మొత్తానికి సిట్ అఫిడవిట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య వివాదానికి మరింత ఆజ్యంపోస్తోంది. మరి సిట్ ఆరోపణలపై సెషన్స్ కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story