Manipur: కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి

Manipur: కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి
మృతదేహాన్ని గుర్తించి అప్పగించిన పోలీసులు

మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా ఎలాంటి ఘటనలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రెండు తెగల మధ్య ఘర్షణతో వందల మంది మృత్యువాత పడగా.. వేలాది మంది కట్టుబట్టలతో ఇళ్లు, వాకిలి వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఇటీవలె పరిస్థితులు అక్కడ శాంతించినట్లు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితి మాత్రం ఇప్పుడు అదుపులోనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సంఘటన మరోసారి తీవ్ర సంచలనం సృష్టించింది. సెలవుల్లో ఇంటికి వచ్చిన జవాన్‌ను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసిన దుండగులు.. అతి దారుణంగా హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని తరుంగ్ ప్రాంతానికి చెందిన సెర్టో తంగ్తాంగ్ కోమ్( దేశ రక్షణలో బాధ్యత వహిస్తున్న సైనికుడు. రీసెంట్ గా సెలవులు పెట్టి ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు.. కోమ్​ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. కోమ్‌ను ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్లు అతని పదేళ్ల కుమారుడు వెల్లడించాడు. ఈ కేసులో ఆ బాలుడే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కోమ్ ను వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అతని ఆచూకీ మాత్రం లభించలేదు. మరుసటి రోజు ఖునింగ్‌థెక్ గ్రామ పరిధిలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతి చెందిన జవాన్​ కోమ్ ను అధికారులు గుర్తించారు. అతడి తలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని వారు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వివరించారు. మృతుడు సెర్టో తంగ్తాంగ్ కోమ్​ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కిడ్నాప్, హత్యపై భారత సైన్యం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్లిష్ట సమయాల్లో సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు అతని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. సెర్టో తంగ్‌తంగ్ కోమ్ కుటుంబానికి అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ఒక ఆర్మీ టీంను మణిపూర్‌లోని అతని స్వగ్రామానికి పంపించినట్లు సైన్యం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story