ఢిల్లీలో వాయు కాలుష్యం.. గోవాకు సోనియాగాంధీ..

ఢిల్లీలో వాయు కాలుష్యం.. గోవాకు సోనియాగాంధీ..
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీతో కలిసి గోవా వెళ్లారు. దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాను.. దిల్లీలో వాయు కాలుష్యానికి..

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీతో కలిసి గోవా వెళ్లారు. దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియాను.. దిల్లీలో వాయు కాలుష్యానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించడంతో విశ్రాంతి కోసం ఆమె గోవా బయల్దేరి వెళ్లారు. దిల్లీలో వాయు నాణ్యత పెరిగే వరకు అక్కడే ఉండనున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. వైద్యుల సలహా మేరకు దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరి గోవా చేరుకున్న సోనియా గాంధీ.. కొన్ని రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి సోనియా గాంధీ మందులు వాడుతూనే ఉన్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుకాకపోవడంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

గోవా పర్యటనకు ముందు పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలికి సూచనలు ఇచ్చేందుకు సోనియా మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఈ కమిటీలు నియమించారు. ఈ మూడు కమిటీల్లో సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను చేర్చారు. అలాగే, ఆర్థిక వ్యవహారాల కమిటీలో పి.చిదంబరం, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్ ఉండగా.. విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌, సల్మాన్‌ ఖుర్షిద్‌, సప్తగిరి ఉన్నారు. జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో గులాం నబీ ఆజాద్‌‌, వీరప్ప మొయిలీ, విన్సెంట్‌ పాల, వైతిలింగం ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story