ఈ ఏడు ఆల‌స్యంగా నైరుతి రుతుపవనాల ప్ర‌వేశం

ఈ ఏడు ఆల‌స్యంగా నైరుతి రుతుపవనాల ప్ర‌వేశం
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలోకి మూడు, నాలుగు రోజులు అలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు

నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలోకి మూడు, నాలుగు రోజులు అలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సాధారణంగా జూన్‌ ఐదో తేదీ నాటికి రాయలసీమ, పదో తేదీ నాటికి ఉత్తర కోస్తాలో ప్రవేశించాలి. అయితే అరేబియా సముద్రంలో జూన్‌ 5న ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాల రాకకు అడ్డంకిగా మారవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం జూన్‌ 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కానీ, ప్రస్తుతం కేరళ పరిసరాల్లో వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రంలో నైరుతి గాలుల వేగం పెరగడంతో జూన్‌ రెండు, మూడు తేదీల్లోనే రుతుపవనాలు కేరళకు వచ్చే అవకాశముందని కొన్ని అంతర్జాతీయ సంస్థల మోడల్స్‌ వెల్లడిస్తున్నాయి.

జూన్‌ 5న ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయవ్య దిశగా పయనించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కేరళకు రుతుపవనాల రాకకు ఇబ్బంది లేక పోయినా పురోగతిలో మందకొడితనం కనిపించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అల్పపీడనం బలపడి తుఫాన్‌గా మారితే రుతుపనాల విస్తరణపై ప్రభావం చూపుతుంద న్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయంటున్నారు. ఐఎండీ మాజీ అధికారి మాత్రం 10, 12 తేదీల మధ్య రావొ చ్చని, అందుకు అనుగుణంగా రైతులు తొలకరి సాగు ప్రారంభించాలని ఆయన సూచించారు.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story