Sudhamurthy: పేరును దుర్వినియోగపరుస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు

Sudhamurthy: పేరును దుర్వినియోగపరుస్తున్నారని  పోలీసులకు ఫిర్యాదు
తాను హాజరుకాని కార్యక్రమాల్లో తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణ

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి, సంఘ సేవకురాలిగా సుధామూర్తికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధం లేని కార్యక్రమాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కొందరు డబ్బు వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

అపారమైన ఆస్తి, పేరు ఉండి కూడా సింపుల్ గా ఉండే సుధామూర్తి తీరుకు అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు. తన మాటలతో ఎంతో మందిని మోటివేట్ చేసి ఆమె మంచి ఇన్ ఫ్లూయన్సర్ కూడా. అందుకే ఆమె ఎక్కడైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడికి వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దీనినే కొంతమంది ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. సుధామూర్తి వివిధ కార్యక్రమాలకు హాజరు అవుతానని చెప్పకపోయినా ఆమె వస్తుందంటూ డబ్బులు వసూలుల చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన పేరు దుర్వినియోగ పరుస్తున్నారంటూ కంప్లైట్ ఇచ్చారు.


వివరాల్లోకి వెళ్తే.. తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా వారు ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆమె కార్యాలయానికి ఇమెయిల్ పంపించి ఆహ్వానించారు. అయితే తీరిక లేని కారణంగా ఆమె రాలేనని తెలిపారు. అయితే వారు సుధా మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయం సుధా మూర్తి దృష్టికి వచ్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సుధామూర్తి కేకేఎన్‌సీ నిర్వాహకులను సంప్రదించగా తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి లావణ్య అనే మహిళ ఇదంతా చేసిందని వారు తెలిపారు.

మరో ఉదంతంలోనూ సుధామూర్తి పేరును ఓ మహిళ దుర్వినియోగపరిచింది. సుధా మూర్తి USAలో ఒక కార్యక్రమానికి హాజరవుతారని పేర్కొంటూ శ్రుతి అనే మహళ ప్రచారం చేసింది. కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమైన వారి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది. సెప్టెంబర్ 26న ‘డాక్టర్ సుధా మూర్తితో మీట్-అండ్-గ్రీట్’ అనే కార్యక్రమం నిర్వహిస్తు్న్నట్లు ప్రకటనలు చేశారు. ఇది సుధా మూర్తి కంటపడటంతో ఇక వీరిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సుధామూర్తి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌తో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. బెంగళూరు జయనగర్ పోలీసులకు ఆమె కంప్లైట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419, 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66(సి), 66(డి) కింద కేసు నమోదు చేశారు. ఇక సుధామూర్తి పేరు చెప్పి మోసాలకు దిగిన మహిళలు ఇండియాలో ఉన్నారా? లేదా అమెరికాలో ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story