Sukesh Chandrasekhar: ఇప్పుడు టార్గెట్ ఢిల్లీ సీఎం

Sukesh Chandrasekhar: ఇప్పుడు టార్గెట్ ఢిల్లీ సీఎం
కేజ్రీవాల్ తీహార్ జైలుకెళ్లడం ఖాయం అంటూ లేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్

ఆర్థిక మోసాలకు పాల్పడిన కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ కు దుబాయ్ లో మూడు ఫ్లాట్లు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ లేఖ విడుదల చేశారు. 2020లో హైదరాబాద్లోని ఒక ఫార్మా కాంట్రాక్టర్ నుంచి కేజ్రీవాల్ కి ముడుపులు అందాయని ఆరోపించాడు. అంతే కాదు తానే ఈ ఫ్లాట్లు కొన్నానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అయితే జుమైరా పామ్స్ లోని ఆ మూడు అపార్ట్మెంట్లను ఇప్పుడు అత్యవసరంగా అమ్మకానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

ఈ విషయం లో మీరు నిజం మాట్లాడరు కాబట్టి, నాకు, సత్యేందర్ జైన్ కు మధ్య జరిగిన మూడు పేజీల వాట్సాప్ చాట్లను విడుదల చేస్తాను అంటూ కేజ్రీవాల్ ను హెచ్చరించారు సుఖేష్ చంద్రశేఖర్. వచ్చే ఏడు రోజుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, యాంటీ కరప్షన్ విజిలెన్స్ కు కూడా ఒక్కో కాపీని పంపుతాని సుఖేష్ తన లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీలోని న్యాయపాలనకు సంబంధించిన అంశాలను తరచూ లేవనెత్తే కేజ్రీవాల్, ఆయన భాగస్వాములు తనకు, తన కుటుంబానికి ముప్పు తెస్తున్నారని చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. కేజ్రీవాల్ దిగజారి సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని సుఖేష్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేజ్రీవాల్ ఇతరులను నిందించే ముందు తమనితాము చూసుకోవాలని సూచించాడు. త్వరలో కేజ్రీవాల్‌కూడా తీహార్ జైలులో చేరతారని సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు.

గతంలో కల్వకుంట్ల కవితతో ఉన్న సంబంధాలపై లేఖలు విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్…ఇప్పుడు మరో లేఖ విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. తన తరపు లాయర్ అనంత మాలిక్ ద్వారా తాజాగా లేఖ విడుదల చేశారు సుఖేష్ చంద్రశేఖర్.

Tags

Read MoreRead Less
Next Story