Supreme Court : పతంజలిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

Supreme Court :  పతంజలిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
కేంద్రానికి సుప్రీం ఆదేశం

యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను పతంజలి ప్రాథమికంగా ఉల్లంఘించిందని పేర్కొంది. పతంజలి ఆయుర్వేద ఎండీకి నోటీసులు జారీ చేసిన సుప్రీం.. సంస్థకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో తెలపాలని ఆదేశించింది. ఇతర ఔషధాల గురించి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ఇతర ప్లాట్‌ఫాంలలో ప్రతికూల ప్రకటనలు చేయకూడదని గతంలో స్పష్టం చేసినా మళ్లీ దాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పతంజలికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై 2021లో సుప్రీం విచారించింది. ఔషధాల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని అప్పుడు సుప్రీం హెచ్చరించింది. ఆ సందర్భంగా ఉత్పత్తుల బ్రాండింగ్‌కు సంబంధించిన ప్రకటనల్లో జాగ్రత్తగా ఉంటామనీ, ఇతర ఔషధాలకు ప్రతికూల ప్రకటనలు చేయబోమని సుప్రీంకు పతంజలి ప్రతినిధులు అప్పుడు హామీ ఇచ్చారు.

తమ ఆయుర్వేద ఉత్పత్తులు కరోనా వైరస్ వంటి మహమ్మారిని నయం చేస్తాయంటూ గతంలో పతంజలి ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల కిందట విస్తృతంగా వ్యాపార ప్రకటనలను ఇచ్చింది. ఈ యాడ్స్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేకుండానే పతంజలి ఈ రకమైన ప్రచారం చేస్తోందంటూ పేర్కొంది. సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేడు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అడ్వర్టయిజ్‌మెంట్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది. డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై అడ్వర్టయిజ్‌మెంట్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదని ఆదేశించింది. పతంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులను జారీ చేసింది. కోటి రూపాయల వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. AD చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నట్టు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. రెండు సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమౌతోన్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలను తీసుకోలేదని నిలదీసింది.

Tags

Read MoreRead Less
Next Story