Supreme Court : 26 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court : 26 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి నిరాకరించిన సుప్రీంకోర్టు
ఆరోగ్యంగా ఉన్న ఆ గుండెచప్పుడు ఆపలేం..

గతకొద్ది రోజులుగా విపరీతంగా మలుపుతూ తిరుగుతున్న గర్భవిచ్చిత్తి కేసులో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తన 26 వారాల గర్భాన్ని తొలగించుకొనేందుకు పిటిషన్‌దారురాలైన ఓ 27 ఏండ్ల వివాహితకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. గర్భంలోని పిండం ఆరోగ్యవంతంగా ఉన్నదని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గర్భం వయసు మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) గరిష్ఠ పరిమితి అయిన 24 వారాలు దాటిందని, ఆ తర్వాత గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. పిండం వయసు 26 వారాల 5 రోజులుగా ఉన్నదని, పిండంలో అసాధారణ పరిస్థితులు ఏమీ లేవని, తల్లి ఆరోగ్యానికి కూడా తక్షణ ముప్పు లేదని పేర్కొన్నది. గుండెచప్పుడు ఆపలేమని స్పష్టంచేసింది.

ప్రసవానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే తగిన సమయంలో చెల్లిస్తుందని కోర్టు తెలిపింది. తల్లిదండ్రులు కోరుకుంటే పుట్టే బిడ్డను దత్తత ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.


మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్ట ప్రకారం వివాహిత స్త్రీలు, ప్రత్యేక కేటగిరి కిందకు వచ్చే అత్యాచార బాధితులు, వికలాంగులు, మైనర్లు, అనార్యోగం, శారీరక బలహీన మహిళలు తమ గర్భాన్ని విచ్చిత్తి చేసుకోవడానికి గరిష్ట కాల వ్యవధి 24 వారాలుగా ఉంది. ప్రస్తుత కేసులో 26 వారాలకు పైగా వయసు ఉన్న పిండాన్ని తొలగించడానికి మహిళను అనుమతించాలా వద్దా అనే విషయంలో సుప్రీంకోర్టు గందరగోళానికి గురయింది. ముందుగా ఈ పిటీషన్‌ విచారించి ఎయిమ్స్‌ వైద్యులు ఈ నెల 6న ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నెల 9న గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నెల 10న ఎయిమ్స్‌ వైద్యుల్లో ఒకరు పిండం బతికే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు ఈమెయిల్‌ చేశారు. గర్భవిచ్ఛిత్తికి వ్యతిరేకంగా కేంద్రం కూడా పిటీషన్‌ వేసింది. దీనిపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. తుది తీర్పు కోసం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు ఈ పిటీషన్‌ వచ్చింది. గర్భవిచ్ఛితికి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story