Teesta Setalvad: సుప్రీంకోర్టులో రాత్రి విచారణ... తీస్తా సెతల్వాడ్‌కు ఊరట

Teesta Setalvad: సుప్రీంకోర్టులో రాత్రి విచారణ... తీస్తా సెతల్వాడ్‌కు ఊరట
తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఉపశమనం... వెంటనే లొంగిపోవాలని గుజరాత్‌ హై కోర్టు ఆదేశం...వారం రోజులు స్టే విధించిన త్రిసభ్య ధర్మాసనం...

ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి తీస్తా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సాయంత్రం 6:30 గంటలకు తీస్తా పిటిషన్‌ను విచారించింది. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ అయ్యింది.


శనివారం రాత్రి 9:15 గంటలకు దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిజ్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత... సుప్రీంకోర్టు బెంచ్‌ వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీస్తా సెతల్వాడ్‌కు ఏడు రోజుల మధ్యంతర రక్షణ కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం మహిళగా ప్రత్యేక రక్షణ పొందేందుకు తీస్తా సెతల్వాద్‌కు అర్హత ఉందని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు చేసుకునేందుకు ఆమెకు సమయం ఇవ్వకపోవడానికి కారణం లేదని న్యాయమూర్తులు తెలిపారు.

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నానావతి కమిషన్‌కు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ పోలీసులు అభియోగాలు మోపారు. కల్పిత సాక్ష్యాలు, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై తీస్తా సెతల్వాద్ ను గతంలో గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ముంబైలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో ఆమెకు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు. అయితే ఆమె సాధారణ బెయిల్‌ కోసం తాజాగా గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story