Haryana: హర్యానాలో మళ్లీ ఉద్రిక్తత

Haryana: హర్యానాలో మళ్లీ ఉద్రిక్తత
పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో గాయపడిన ఎనిమిది మంది మహిళలు

హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. గురువారం రాత్రి పూజ‌కు వెళుతున్న మ‌హిళ‌ల‌పై మ‌సీదు నుంచి కొంద‌రు ఆక‌తాయిలు రాళ్లు రువ్వ‌డంతో వారికి గాయాల‌య్యాయి. మ‌హిళ‌ల‌పై కొంద‌రు బాలురు రాళ్లు విసిరిన వీడియో ఫుటేజ్ ల‌భ్య‌మైంద‌ని నూహ్ ఎస్పీ న‌రేంద్ర బిజ‌ర్నియ తెలిపారు. మ‌సీదులో నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న క్ర‌మంలో గురువారం రాత్రి 8.20 గంట‌ల ప్రాంతంలో పూజ‌లు చేసేందుకు వెళుతున్న మ‌హిళ‌ల‌పై మ‌సీదులో నుంచి రాళ్లు రువ్వార‌ని వీడియో ఫుటేజ్‌లో క‌నిపించిన బాలురిని ప్ర‌శ్నిస్తున్నామ‌ని ఎస్పీ తెలిపారు.

ఈ ఘ‌ట‌న అనంత‌రం ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్ధితులు నెల‌కొన‌డంతో ఇరు వ‌ర్గాల‌ను శాంతింప‌చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ప‌రిస్ధితి ప్ర‌శాంతంగా ఉంద‌ని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని తెలిపారు. కాగా జులై 31న నూహ్‌లో వీహెచ్‌పీ బ్ర‌జ్ మండ‌ల్ యాత్ర‌పై అల్ల‌రి మూక‌లు దాడి చేసిన అనంత‌రం జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల్లో ఇద్ద‌రు హోంగార్డులు స‌హా ఆరుగురు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

అప్ప‌ట్లో హింసాకాండ పొరుగున ఉన్న గురుగ్రాం ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించింది. నూహ్‌లో అల్ల‌ర్లు చెల‌రేగిన స‌మ‌యంలో ఐపీఎస్ అధికారి వ‌రుణ్ సింగ్లా సెల‌వులో ఉండ‌టంతో తాత్కాలిక ఎస్పీగా బిజ‌ర్నియా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Tags

Read MoreRead Less
Next Story