ఎవరి వస్తువులకు వారే బాధ్యులు: సుప్రీంకోర్టు

ఎవరి వస్తువులకు వారే బాధ్యులు: సుప్రీంకోర్టు
రైలు ప్రయాణంలో చోరిపై సుప్రీం కీలక తీర్పు

రైలు ప్రయాణంలో జరిగిన దొంగతనానికి రైల్వే శాఖ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 18 ఏళ్ల క్రిందట జరిగిన చోరీ కి సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సురేందర్ భోళా అనే వస్త్ర వ్యాపారి 2005లో కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్తుండగా లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రైలులో చోరీ జరిగింది కాబట్టి ఆ మొత్తాన్ని రైల్వే నుంచి ఇప్పించాలని కోరుతూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.

విచారణ జరిపిన కన్జ్యూమర్స్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ సవాలు చేయగా రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాలు తోసిపుచ్చాయి. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. ప్రయాణికుడు తన డబ్బును బెల్టులో దాచి నడుముకు కట్టుకున్నడని విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. కేసును విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను తప్పుబట్టింది.

ప్రయాణంలో చోరీ రైల్వే సేవల లోపం కిందికి వస్తుందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేనప్పుడు దానికి రైల్వే శాఖను బాధ్యుల్ని చేయడం కుదరదని తేల్చి చెబుతూ వినియోగదారుల ఫోరాలు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. అసలు రైలు ప్రయాణం చెయ్యాలి అంటే దానికి రైల్వే డిపార్ట్‌మెంట్ కొన్ని నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనలను ప్రతి ప్రయాణికుడు తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రయాణికులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 7 ప్రధాన నిబంధనలు ఉన్నాయి.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్ కలిగి ఉండాలి. టిక్కెట్ లేని ప్రయాణం నేరం. ప్రయాణీకులు తమతో లగేజీని కూడా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే లగేజీ బరువు పరిమితికి మించి ఉండకూడదు. రైళ్లు, ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ఆవరణలో ధూమపానం, మద్యపానం చేయడం నిషిద్ధం. అలాగే ప్రయాణికుడు తమ టికెట్‌ను క్యాన్సిల్ చేయాలనుకుంటే ట్రైన్ షెడ్యూల్ కంటే ముందే క్యాన్సిల్ చేయాలి. అలా అయితేనే రిఫండ్ లభిస్తుంది. లేదంటే డబ్బు తిరిగి చెల్లించబడదు. ఇక ప్రయాణీకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండాలని రైల్వే శాఖ సూచిస్తోంది. ఎందుకంటే అవి పోతే వాటి బాధ్యతను ఎట్టి పరిస్థితులలోనూ రైల్వే శాఖ తీసుకోదు. అందుకు ఈ కేసు ఒక ఉదాహరణ.

Tags

Read MoreRead Less
Next Story