TRAIN ACCIDENT: ఆ ముగ్గురి వల్లే ఒడిశా రైలు ప్రమాదం

TRAIN ACCIDENT: ఆ ముగ్గురి వల్లే ఒడిశా రైలు ప్రమాదం
ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తులో కీలక పరిణామం.... ముగ్గురు రైల్వే అధికారులను అరెస్ట్‌ చేసిన సీబీఐ.... పెను ప్రమాదం జరుగుతుందని వీరికి ముందే తెలుసని వెల్లడి

యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన ఒడిశాలోని బాలేశ్వర్‌ దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో కుట్రకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రమాదంతో సంబంధమున్న ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసింది. సిగ్నలింగ్‌ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మెహతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అదుపులోకి తీసుకుంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ ముగ్గురు ఉద్యోగులపై సీఆర్సీసీ 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


జూన్ 2 రాత్రి 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుట్ర కోణాన్ని అన్వేషించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తులో భాగంగా రైల్వే శాఖ ఉద్యోగులు, సిబ్బంది సహా పలువురిని ఇప్పటికే సీబీఐ అధికారులు విచారణ జరిపారు. అయితే ఎలాంటి కుట్ర లేదని ఉద్యోగుల నిర్లక్ష్యం వల్లే ప్రమదం జరిగిందని గుర్తించి కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ ఘోర రైలు ప్రమాదంపై కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ కూడా అధ్యయనం చేసింది. ఉద్యోగుల అజాగ్రత్త వల్లే 3 రైళ్లు ఢీకొని ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ తేల్చింది. సిగ్నలింగ్‌, టెలి కమ్యూనికేషన్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులు సరైన విధంగా స్పందించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నివేదిక రూపొందించింది. దానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను కూడా అందజేసింది. సంబంధిత సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోనే లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని తెలిపింది. ఆ తర్వాత దాని బోగీలు పక్క ట్రాక్‌పై పడగా అటుగా వస్తున్న మరో రైలు ఢీకొట్టి పట్టాలు తప్పినట్లు అందులో పేర్కొంది. ఈ నివేదికను ఇంకా అధికారికంగా బయట పెట్టాల్సి ఉంది.

బాలాసోర్ రైలు ప్రమాదంలో 293 మందికి పైగా మరణించగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ ఇందులో చాలా మృతదేహాలను గుర్తించలేదు. అవి భువనేశ్వర్ ఆస్పత్రుల్లోనే ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story