Manipur : రాష్ట్ర పోలీసులను ప్రశ్నించిన సీజేఐ డీవై చంద్రచూడ్

Manipur : రాష్ట్ర పోలీసులను ప్రశ్నించిన సీజేఐ డీవై చంద్రచూడ్
తదుపరి విచారణ మంగళవారం మధ్యాహ్నం

దేశం మొత్తాన్ని కుదిపేసిన మణిపూర్ సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రానికి సుప్రీం కోర్టు సూటి ప్రశ్న వేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూఢ్ ప్రశ్నిస్తూ.. ఒక వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు అదొక్కటే కాదు చాలా జరిగాయని అన్నారు. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని వ్యాఖ్యానించారాయన. ఈ వాస్తవాన్ని అందరూ అంగీకరించక తప్పదనీ పేర్కొన్నారు. మత కలహాలు సంభవించినప్పుడు కూడా మహిళలపైనే దాడులు తీవ్రతరమౌతున్నాయని పేర్కొన్నారు. పరిపాలనపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే విషయం తమను ఆందోళనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సీబీఐ, సిట్‌లకు విచారణకు అప్పగించడం మాత్రమే చాలదని పేర్కొన్నారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.

బాధిత మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరపున సినియన్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. తమకు జరిగిన అన్యాయంపై నిష్పాక్షిక విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించాలని ఆ ఇద్దరు మహిళలు తమ పిటిషన్‌లో కోరారు. తమ పేర్లు, ఇతర వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని వారు అర్థించారు. అలాగే ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌ను బాధిత మ‌హిళ‌లు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బ‌దిలీ చేయ‌వద్దంటున్నట్లు క‌పిల్ సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. ప్ర‌భుత్వం త‌ర‌పున కేసును వాదించిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని అన్నారు. అయితే విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే వారు కోరినట్లు తెలిపారు. వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story