West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీఎంసీ, బీజేపీ సభ్యులు..

West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న టీఎంసీ, బీజేపీ సభ్యులు..
West Bengal: పశ్చిమ బెంగాల్‌ బీర్‌ భూం సజీవ దహనాల ఘటన అసెంబ్లీని కుదిపేసింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌ బీర్‌ భూం సజీవ దహనాల ఘటన అసెంబ్లీని కుదిపేసింది. దీనిపై బెంగాల్ శాసన సభలో ఉద్రిక్తత నెలకొంది. సజీవ దహనాల ఘటనపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఇరు పక్షాలకు చెందిన సభ్యులు మొదట వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు తో్సుకుంటూ కొట్టుకున్నారు. దీంతో సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది.

ఇటీవల బీర్‌భూం జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన బీజేపీ సభ్యులు.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై సీఎం మమతా బెనర్జీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే భాజపా నేతలను తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది.

మొదట వాగ్వాదానికి దిగిన బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల వివాదం...చిలికిచిలికి గాలివానగా మారింది. ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి లేచి గొడవకు దిగారు. ఈ ఘటనలో పలువురు సభ్యులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటన అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 'అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

తమపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపిస్తూ అసెంబ్లీ భయట నిరసన తెలిపారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారని టీఎంసీ అంటోంది. మరోవైపు ఘటన నేపథ్యంలో ఐదుగురు బీజేపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సువేందు అధికారి, మనోజ్‌ టిగ్గా, నరహరి మహతో, శంకర్‌ ఘోష్‌, దీపర్‌ బర్మాన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

మార్చి 21న బీర్‌భూం జిల్లాలో బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భాదు షేక్‌ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే రామ్‌పుర్‌హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో 8 మంది సజీవ దహనమయ్యారు. భాదు షేక్‌ హత్యతో ప్రత్యర్థు ఇళ్లకు టీఎంసీ కార్యకర్తలు నిప్పు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు ముందు వారిని తీవ్రంగా కొట్టిచంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కలకత్తా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే తృణమూల్‌ నేత సహా 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story