Bengal Panchayat Results: విజయం దిశగా టీఎంసీ

Bengal Panchayat Results: విజయం దిశగా టీఎంసీ
దరిదాపుల్లో లేని విపక్షాలు

పశ్చిమబెంగాల్‌లో పంచయతీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా పరిగెడుతోంది. మంగళవారం రాత్రి 11 గంటలకు 30,391చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. ఓట్ల లెక్కింపులో మరో 1,767 పంచాయతీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్ గ్రామపంచాయతీ ఎన్నికలను అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డాయి. అయితే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మమత బెనర్జీ ఛరిష్మాను అడ్డుకోలేకపోయింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతను సాధించింది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చాయి ఈ ఎన్నికలు. అటు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి.


పశ్చిమ బెంగాల్‌లో మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలులో ఉంది. ఇక్కడ మొత్తం 3,317 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 63,229 స్థానాలు. 22 జిల్లా పరిషత్‌లలో 928 సీట్లు, 341 పంచాయతీ సమితిల్లో 9,730 పంచాయతీ సమితి స్థానాలలో ఈ నెల 8వ తేదీన పోలింగ్ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,36,464 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి 85,817 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ 56,321 మంది అభ్యర్థులను రంగంలో దించింది. సీపీఎం 48,646, కాంగ్రెస్ 17,750 మంది ఎన్నికల బరిలో నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని సాగించాయి.

మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 339 కౌంటింగ్ కేంద్రాలలో భారీ భద్రతల నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం గ్రామస్థాయిలో ప్రజలు మమత బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ఆమె సారథ్యాన్ని వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. కౌంటింగ్ మరో రెండు రోజులు జరిగే అవకాశం ఉంది.

పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. సుమారు 697 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు అధికారులు. కౌంటింగ్ రోజున కూడా కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఎటువంటి హాని జరగలేదు.

Tags

Read MoreRead Less
Next Story