Rajasthan : యువతిని నగ్నంగా ఊరేగించి.. వీడియోలు తీసి..

Rajasthan : యువతిని నగ్నంగా ఊరేగించి.. వీడియోలు తీసి..
మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో

మణిపూర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన నుంచి ప్రజలు, ప్రభుత్వాలు ఇంకా తేరుకోకముందే రాజస్థాన్ లో అటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటుండగా ఆమెపై భర్త కర్కశంగా ప్రవర్తించాడు. రక్షించాలంటూ బాధిత మహిళ కేకలు వేసినప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె అత్తగారి వైపు నుండి కొంతమంది మహిళలు కూడా పాల్గొన్నట్లు కనిపించారు. దీంతో మొత్తం నిందితులందరినీ త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.


ఆ యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుండడంతోనే ఆమె భర్త దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.. బాధిత యువతి వేరే గ్రామంలో ఉన్న సమయంలో ఆమెను అత్తింటి వారు కిడ్నాప్ చేసి సొంత గ్రామానికి తీసుకువచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అమానవీయ ఘటనను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పౌర సమాజంలో ఇటువంటి నేరగాళ్లకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. నేరస్థులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

యువతిని నగ్నంగా ఊరేగించిన ఘటనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక బీజేపీ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఇది హద్దులులేని అమానవీయ ఘటన అని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన రెండు రోజులైనా పోలీసులు రిపోర్టు సిద్ధం చేయలేదేంటని రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘‘మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఈ ఘటన బయటపెట్టిందని కూడా వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పుడు రాహుల్ గాంధీ.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారా? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరతారా?’’ అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story