ASSAM: అసోంలో చరిత్రాత్మక శాంతి ఒప్పందం

ASSAM: అసోంలో చరిత్రాత్మక శాంతి ఒప్పందం
సంతకం చేసిన కేంద్ర ప్రభుత్వం-ఉల్ఫా.... అసోం చరిత్రలో శుభ దినమన్న అమిత్ షా

అసోంలో శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం...ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. కేంద్ర, అసోం ప్రభుత్వాలతో జరిగిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు రావడంతో.. ఉల్ఫా అనుకూలవర్గం శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. హింసను విడనాడేందుకు, తమ సంస్థను రద్దు చేసేందుకు ఉల్ఫా అంగీకరించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో.... తిరిగి చేరుతామని ఉల్ఫా ప్రతినిధులు ప్రకటించారు. శాంతి ఒప్పందం జరిగిన ఈరోజు...అసోం ప్రజలకు శుభదినమని.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ఉల్ఫా హింస కారణంగా అసోం చాలా నష్టపోయిందని..... హింసను వీడి ఉల్ఫా ప్రజాస్వామ్య ప్రక్రియలో చేరడం గొప్ప విషయమని అమిత్‌ షా కొనియాడారు. అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు షా ప్రకటించారు.

శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత అమిత్‌ షా మాట్లాడుతూ... "అసోం భవిష్యత్తుకు ఇది శుభదినం. చాలాకాలంగా అసోంలో హింస చెలరేగుతోంది. ఈశాన్య ప్రాంతాల్లోనూ హింస కొనసాగుతూనే ఉంది. నరేంద్రమోదీ 2014లో ఎప్పుడైతే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారో అప్పటినుంచి దిల్లీ-ఈశాన్య రాష్ట్రాల మధ్య దూరం తగ్గించేందుకు కృషి చేశారు. విశాల హృదయంతో అందరితోనూ చర్చలు జరిపారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంతో ఉగ్రవాద విముక్త.. హింస విముక్త, వివాద రహిత ఈశాన్య రాష్ట్రాల స్థాపనే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. గత అయిదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో తొమ్మిదిసార్లు శాంతి, భూభాగానికి సంబంధించిన సున్నితమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈశాన్య రాష్ట్రంలో హింస స్థానంతో శాంతిస్థాపన జరిగింది “ అని అమిత్‌ షా అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story