Ayodhya : అయోధ్య‌కు హెలికాఫ్ట‌ర్ సేవ‌లు ప్రారంభం

Ayodhya : అయోధ్య‌కు హెలికాఫ్ట‌ర్ సేవ‌లు ప్రారంభం
భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు చేపట్టనున్న యూపీ

మ‌రో రెండు వారాల్లో అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం నేప‌ధ్యంలో యూపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయోధ్య‌లో నూత‌నంగా నిర్మించిన రామాల‌యంలో జ‌న‌వ‌రి 22న రాముడి విగ్ర‌హానికి ప్రాణ ప్ర‌తిష్ట జ‌ర‌గ‌నుండ‌టంతో ఈ వేడుక‌ను తిలకించేందుకు భ‌క్తులు పోటెత్తనున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద‌సంఖ్య‌లో సంద‌ర్శ‌కులు రానుండ‌టంతో త్వ‌ర‌లో హెలికాఫ్ట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభిస్తామ‌ని యూపీ రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్ల‌డించారు.

జ‌న‌వ‌రి 22లోగా హెలికాఫ్ట‌ర్ స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మంత్రి తెలిపారు. త‌మ శాఖ త‌ర‌పున హెలికాఫ్ట‌ర్ స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని, అయోధ్య‌లో ఎయిర్‌పోర్ట్ సేవ‌లు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయ‌ని మంత్రి పేర్కొన్నారు. రామాల‌య ప్రారంభ వేడుక‌కు అయోధ్య‌కు త‌రలివ‌చ్చే భ‌క్తులంద‌రికీ స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు. అయోధ్య‌కు వ‌చ్చే సంద‌ర్శ‌కుల సంఖ్య పెరగ‌నుండ‌టంతో రైల్వేల సామ‌ర్ధ్యం కూడా పెంచుతామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

జ‌న‌వ‌రి 22న జ‌రిగే రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మం స‌జావుగా సాగేందుకు అధికారులు స‌న్నాహాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈనెల 22న శ్రీరాముడి జ‌న్మ‌స్ధ‌లమైన అయోధ్య‌లో నూత‌న రామాల‌యంలో శ్రీరామ విగ్ర‌హం కొలువుతీర‌నుండ‌టంతో ఈ కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా అతిపెద్ద చారిత్ర‌క‌, ఆధ్యాత్మిక‌, సాంస్కృతిక ఘ‌ట్టంగా ఆవిష్కృతం కానుంది.

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు జనవరి 16 నుంచి మొదలుకానున్నాయి. డిసెంబరు 30న అయోధ్యలో విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌లను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట శ్రీరామ జ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు.

‘ఈ చారిత్రాత్మక క్షణం చాలా అదృష్టవశాత్తూ మన జీవితంలోకి వచ్చింది. దేశం కోసం మనం కొత్త సంకల్పం చేసుకోవాలి... మనలో కొత్త శక్తిని నింపుకోవాలి. ఇందుకోసం జనవరి 22న తమ ఇళ్లలో శ్రీరామజ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకోవాలని 140 కోట్ల మంది దేశప్రజలను కోరుతున్నాను.’ అని మోదీ కోరారు. మరోవైపు, ప్రారంభోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, కళాకారులు, సాధువులు, పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story