Uttar Pradesh Election 2022: ఉత్తర ప్రదేశ్‌లో ఓవైసీ ప్రభావంపై అంతటా చర్చ..

Uttar Pradesh Election 2022: ఉత్తర ప్రదేశ్‌లో ఓవైసీ ప్రభావంపై అంతటా చర్చ..
Uttar Pradesh Election 2022: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో అయోధ్య రాముడు, కాశీ విశ్వేశ్వరుడి సెంటిమెంటే కాదు.

Uttar Pradesh Election 2022: ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో అయోధ్య రాముడు, కాశీ విశ్వేశ్వరుడి సెంటిమెంటే కాదు.. ముస్లింల ఓట్లు కూడా ఫలితాలను తారుమారు చేస్తాయి. ఈసారి ముస్లిం ఓట్లర్లు ఎస్పీ వైపే ఉన్నారనే సర్వేలు చెబుతున్నాయి. యాదవ్‌-ముస్లిం ఓట్‌ బ్యాంక్‌ లక్ష్యంగా పావులు కదిపిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ చాలా వరకు సక్సెస్‌ అయ్యారు కూడా. కాని, మొన్న ఓవైసీపై కాల్పుల తరువాత పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నిజానికి యూపీలో అసదుద్దీన్‌ ఓవైసీ ప్రభావం అంతంత మాత్రమేనన్నది పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. కాని, ఎప్పుడైతే కాల్పులు జరిగాయో అప్పటి నుంచి పరిస్ధితి మారిందంటున్నారు. ఎంఐఎం పార్టీపై ఓ అపవాదు ఉంది. పరోక్షంగా ఆ పార్టీ బీజేపీకే లబ్ది చేకూరుస్తుందన్న వాదన దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ సారథ్యంలోని మహాకూటమి ఓడిపోవడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీనే కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఈసారి యూపీలో కూడా అదే పనిచేయబోతున్నారంటూ అప్పుడే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి పరోక్షంగా సహకరించబోతున్నారని చెప్పుకుంటున్నారు. యూపీలో ఓవైసీ ప్రచార తీరు కూడా అలాగే ఉందంటోంది సమాజ్‌వాదీ పార్టీ.

ముస్లింలు రాజకీయ ఆధిపత్యం సాధించాలంటూ పిలుపిస్తున్న ఓవైసీ.. అఖిలేశ్‌కు అండగా ఉన్న ముస్లిం-యాదవ్‌ కూటమి నుంచి బయటపడాలని పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఓవైసీ కారుపై జరిగిన కాల్పుల ఘటనతో ఆ పార్టీపై సానుభూతి పెరిగింది. దీంతో ముస్లిం ఓటర్లు తమ విజయానికి గండి కొడతారేమోనని అఖిలేశ్‌ కలవరపడుతున్నారు.

అటు మాయావతి కూడా ఎంఐఎం పార్టీకి సహకారం అందిస్తున్నారని విమర్శిస్తోంది సమాజ్‌వాదీ పార్టీ. ఈసారి మాయావతి కూడా దళిత-ముస్లిం అంటూ కొత్త సామాజిక సమీకరణను ఆమె తెరపైకి తెచ్చారు. ఇది ఓవైసీ నినాదమైన జై భీమ్‌.. జై మీమ్‌కు దగ్గరగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. యూపీలో ముస్లిం ఓటర్లు బీజేపీ వైపు ఉండే అవకాశం లేదు.

అంతో ఇంతో ఎస్పీ వైపే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, మాయావతి, ఓవైసీల ట్రయాంగిల్ స్ట్రాటజీ కారణంగా ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీకి దూరమయ్యేలా ఉన్నారు. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే.. యూపీలో తిరిగి బీజేపీ అధికారం చేజిక్కించుకోడానికి ఓవైసీ, మాయావతే కారణమవుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story