Uttarakhand: కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం... 41 మందినీ ఆసుపత్రికి తరలింపు

Uttarakhand: కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం... 41 మందినీ ఆసుపత్రికి తరలింపు
హర్షం వ్యక్తం చేసిన ముర్ము, మోదీ

విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన సహాయక బృందాల శ్రమ ఫలించింది. ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ర్యాట్-హోల్ మైనింగ్ ద్వారా టన్నెల్ లోపలికి మార్గాన్ని ఏర్పాటు చేసి, చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించడానికి చేసిన ఆపరేషన్ సత్ఫలితాన్ని ఇచ్చింది. బయటకు వచ్చిన కూలీలను అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా సురక్షితంగా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికులను స్వయంగా పలుకరించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, టన్నెల్ నుంచి కార్మికులను విడతల వారీగా బయటికి తీసుకువచ్చారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ ల ద్వారా చిన్యాలిసౌర్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన 41 మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. వారికి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లేంతవరకు ఆసుపత్రుల్లో చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సొరంగం దగ్గర 41 అంబులెన్స్ లు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచారు. వారిని తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.


ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలుపుతూ 4.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. నవంబరు 12న సిల్క్యారా ప్రాంతం వైపు టన్నెల్ కూలిపోయింది. 205వ మీటరు నుంచి 260వ మీటరు వరకు టన్నెల్ మూసుకుపోయింది. అప్పటికే లోపల 41 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారికి ఓ పైపు ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. వారు నీరసపడిపోకుండా మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ వచ్చారు. డ్రై ఫ్రూట్స్, మల్టీవిటమిన్ మాత్రలు, డిప్రెషన్ కు లోనవ్వకుండా యాంటీడిప్రషన్ ఔషధాలు కూడా పంపించారు. వారు తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి అవసరమైన పదార్ధాలు అందుకునే వెసులుబాటును కల్పించడంతో వారు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు అటు సహాయక బృందాలకు, ఇటు కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది.


Tags

Read MoreRead Less
Next Story