కంగ‌నాను చిక్కుల్లో పడేసిన వీడియో

కంగ‌నాను చిక్కుల్లో పడేసిన వీడియో
సుశాంత్ ఆత్మహత్య కేసుతో మొద‌లైన వివాదం చివరికి.. కంగ‌నా, మ‌హారాష్ట్ర ప్రభుత్వానికి మ‌ధ్య యుద్ధంలా మారిపోయింది. కంగ‌నా ముంబైని పీఓకేతో పోల్చడం..

సుశాంత్ ఆత్మహత్య కేసుతో మొద‌లైన వివాదం చివరికి.. కంగ‌నా, మ‌హారాష్ట్ర ప్రభుత్వానికి మ‌ధ్య యుద్ధంలా మారిపోయింది. కంగ‌నా ముంబైని పీఓకేతో పోల్చడం, బీఎంసీ అధికారులు కంగ‌నా ఆఫీసును కూల్చివేయ‌డం వంటి ప‌రిణామాలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. తాజాగా బీఎంసీ నుంచి ఫైర్‌బ్రాండ్‌ నటికి మరో నోటీసు అందింది. ఖర్‌లోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాల్యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఖర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు.

అటు కంగనా రనౌత్‌ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ముంబయిలో తనకు ఎదురవుతోన్న పరాభవాల గురించి వివరించారు. గవర్నర్‌ తన సొంత కూతురి మాదిరిగానే తన సమస్యను వినడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇకనైనా న్యాయం కలుగుతుందనే నమ్మకం ఉందని గవర్నర్‌ను కలిసిన అనంతరం కంగనా రనౌత్‌ అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ను కలిసిన సమయంలో కంగన వెంట ఆమె సోదరి రంగోళీ కూడా ఉన్నారు.

మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. కరోనా వైరస్‌తోపాటు రాజకీయ అడ్డంకులు ఎన్ని వచ్చినా వాటిని ఎదుర్కొంటానని ఉద్ధవ్‌ స్పష్టంచేశారు. కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనావైరస్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌, తాజాగా కంగనా వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. కంగనాపై కాకుండా కరోనావైరస్‌పై పోరాడాలని హితవు పలికింది. దీంతో ముఖ్యమంత్రి రాష్ట్రప్రజలనుద్దేశించి ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రకృతితోపాటు రాజకీయ తుపాన్ల వంటి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు. కరోనావైరస్‌తోపాటు రాజకీయ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటాననే ధీమా వ్యక్తం చేశారు.

తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే ముంబై వ‌దిలి వెళ్లిపోతా అంటూ ప్రకటించిన కంగ‌నాను తాజాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియో చిక్కుల్లో పడేసింది. ఈ ఏడాది మార్చిలో కంగ‌నా త‌న జీవితంలోని చెడు అధ్యాయాల‌ను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. 15 ఏళ్లకే ఇల్లు విడిచి పారిపోయాన‌న్నారు. ఆ త‌ర్వాత 2 ఏళ్లకే సినిమా స్టార్‌ను అయ్యాన‌ని చెప్పారు. యుక్త వ‌య‌సు వ‌చ్చేస‌రికి డ్రగ్స్‌కు కూడా బానిస‌గా మారిపోయాన‌ని చెప్పుకొచ్చారు. అప్పుడు త‌న జీవితమంతా గంద‌ర‌గోళంగా మారిపోయిందని, తాను త‌ప్పుడు వ్యక్తుల చేతుల్లో ప‌డ్డాన‌ని గ్రహించాన‌ని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే రేపుతోంది. మొత్తానికి సుశాంత్ సూసైడ్ కేసుతో మొదలైన వివాదం ... ఇప్పుడు కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా మారిపోయింది. బీజేపీ కూడా కంగనాకు మద్దతు తెలపడంతో ఈ ఇష్యూ రాజకీయంగా దుమారం రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story