WB poll violence: ప్రాణ భయంతో అస్సోమ్ కు 133 మంది వలస

WB poll violence: ప్రాణ భయంతో అస్సోమ్ కు 133 మంది వలస
ప్రాణ భయంతో అస్సామ్ కి పారిపోయిన 133 మంది... ఆశ్రయం కల్పించామన్న సీఎం హిమంతబిశ్వ శర్మ.... వైద్య సాయం, ఆహారం అందించామని వెల్లడి

పశ్చిమబెంగాల్లో పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింసకాండ వేళ.. ప్రాణ భయంతో అస్సాంకి పారిపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. బెంగాల్‌ నుంచి ప్రాణ భయంతో తమ రాష్ట్రానికి వచ్చిన 133 మందికి ఆశ్రయం కల్పించామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వీరందరికీ ధుబ్రి జిల్లా ఝపుసబరి ప్రాంతంలోని పాఠశాలలో ఆశ్రయం ఇచ్చామని వివరించారు. వచ్చిన వారికి ఆహారం, వైద్య సహాయం అందించామని సీఎం వెల్లడించారు.


బెంగాల్లో ఎనిమిదో తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో రాష్ట్రం దద్దరిల్లింది. కొన్ని చోట్ల బ్యాలెట్‌ బాక్స్‌లు ఎత్తుకొని పోవడం, వాటికి నిప్పు పెట్టడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పోలింగ్ వేళ చెలరేగిన హింసాకాండలో పది మంది మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముర్షీదాబాద్, నాడియా, కూచ్‌ బెహార్, జిల్లాలతో పాటు దక్షిణ 24 పరగణాలోని భాంగార్, నందిగ్రామ్‌లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోమవారం 696 బూత్‌లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికల రీపోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి 69.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.


పోలింగ్‌ వేళ గవర్నర్‌ ఆనంద బోస్‌ ఉత్తర స్వయంగా కొన్ని కేంద్రాలను సందర్శించారు. అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. అనంతరం ఢిల్లీకి వెళ్లిన బెంగాల్‌ గవర్నర్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ములతో విడివిడిగా భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో హింసపై ఆయన అమిత్‌ షాకు నివేదిక సమర్పించారు.

ఎన్నికల్లో హింసకు మీరు కారణమంటే మీరేనని బీజేపీ, టీఎంసీలు ఒకరినొకరు నిందించుకున్నాయి. ఈ స్థాయిలో హింస చెలరేగితే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని టీఎంసీ ప్రశ్నించింది. కేంద్ర బలగాలు ఎందుకు మోహరించాయని, టీఎంసీ కార్యకర్తల్ని హత్య చేస్తూ ఉంటే ఆ బలగాలు ఏం చేస్తున్నాయని నిలదీసింది. మరోవైపు బెంగాల్‌లో అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బాంబుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారిందని, అంతర్జాతీయంగా దేశం పరువు పోతోందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. హత్యల కారణంగా ఎన్నికల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో కాంగ్రెస్‌ నాయకుడు కౌస్తవ్‌ బగ్చి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story