Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు - కాంగ్రెస్‌కు షాకిచ్చిన దీదీ

Mamata Banerjee: ఒంటరిగానే ఎన్నికలకు - కాంగ్రెస్‌కు షాకిచ్చిన దీదీ
లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్ల పోటీ చేస్తుందని వెల్లడి

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల భారత కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక నేతగాఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తుతో పోటీకి వెళ్లదని అన్నారు. కూటమిలోని పార్టీలతో తమ ప్రతిపాదలన్నీ తిరస్కరణకు గురయ్యాయని, అందుకే ఒంటిరిగా బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు.

మరోవైపు రాహుల్‌ యాత్ర (Rahul Yatra)పై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్‌ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్‌ యాత్ర సాగనుంది.. అయినా మాకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్ లోకి కుచ్ బెహార్ వద్ద ప్రవేశిస్తుంది. ఏడు జిల్లాల్లో ఐదు రోజులు మొత్తం 523 కిలో మీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ పాదయాత్రపై మమతా బెనర్జీ స్పందించారు. రాహుల్ యాత్రపై కనీసం సమాచారంకూడా ఇవ్వలేదని, దీనిపై కాంగ్రెస్ వారు ఏమీ చర్చించలేదని మమత అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ బెంగాల్ లో ఒంటిరిగానే పోటీ చేస్తుంది. మరోవైపు ఇండియా కూటమిలో కొనసాగుతామని మమతా బెనర్జీ చెప్పారు.

పలుమార్లు చర్చల అనంతరం కూటమిలో ప్రస్తుతం సీట్ల పంపకాలపై కసరత్తు జరుగుతోంది. ఈ విషయంలోనే కాంగ్రెస్, టీఎంసీల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. ఏ పార్టీ ఎన్నిచోట్ల పోటీ చేయాలనే విషయంపై ఇరుపార్టీల నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లను మమత ఆఫర్ చేశారని, మరిన్ని సీట్లు కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతోనే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తాజా ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story