Bengal Election Result : పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీదే హవా

Bengal Election Result : పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీదే హవా
పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో దూసుకుపోతున్న టీఎంసీ... అత్యధిక స్థానాలు కైవసం.... దరిదాపుల్లో లేని బీజేపీ, కాంగ్రెస్‌...

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుతూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటోంది. బెంగాల్‌లోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 30,391 సీట్లు గెలుపొందిన టీఎంసీ.. మరో 1,767 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 8,239 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ.. మరో 447 స్థానాల్లో ముందంజలో ఉంది. 2,158 పంచాయతీ స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‌.. మరో 151 సీట్లలో ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సీపీఐ 2,534 స్థానాల్లో విజయం సాధించింది.


ఇతర పార్టీలు 725 స్థానాల్లో గెలిచి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ రెబల్స్‌, స్వతంత్రులు 1,656 స్థానాల్లో గెలిచి 104 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీఎంసీ దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయానికి లెక్కించిన ఓట్ల ఆధారంగా ఈ ఫలితాలు ప్రకటించారు అధికారులు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మరో రెండు రోజులు పట్టే అవకాశముందని బంగాల్‌ ఎన్నికల అధికారులు తెలిపారు.


బెంగాల్లో 9,728 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగగా.. టీఎంసీ 2,155 స్థానాలను గెలుచుకుంది. 493 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 214 పంచాయతీ సమితి స్థానాల్లో గెలిచి 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం 47 స్థానాల్లో గెలిచి 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 38 స్థానాల్లో గెలిచి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 928 జిల్లా పరిషత్‌ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు 18 జిల్లా పరిషత్ స్థానాల్లో టీఎంసీ విజయం సాధించింది. మరో 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది.


మూడు అంచెల పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు టీఎంసీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీకి బెంగాల్లో ఓటే లేదు అన్న ప్రతిపక్ష నేత సువేందు అధికారి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మమతకు ఓటే లేదు అన్న ప్రచారం మమతకే ఓటు అన్న నినాదంగా మారిందని అన్నారు. ఈ ఫలితాలు లోక్‌సభ ఎన్నికలకు తృణమూల్‌కు దారిని సుగుమం చేశాయని అభిషేక్ బెనర్జీ అన్నారు. ఈ ఫలితాలు తమకు కొత్త ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చాయని కూడా వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story