Bihar : నేడు బీహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష..

Bihar : నేడు బీహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష..
హోరెత్తిస్తున్న క్యాంపు రాజ‌కీయాలు

మహాకూటమికి చేయి చూపించి మళ్లీ ఎన్డీఏ గూటికి చేరిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్నారు. మొత్తం 243 మంది సభ్యులున్న బిహార్ శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 122. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 127 మంది (జేడీయూకు 45, బీజేపీకి 78, మాజీ సీఎం జీతన్‌రామ్ మాంఝీ పార్టీ హిందూస్థాన్ అవామీ లీగ్‌కు నలుగురు ఎమ్మెల్యలు) ఉండటంతో సులువుగా గట్టెక్కుతాననే ధీమాగా ఉన్నారు నితీశ్ కుమార్. మరోవైపు, మహా గట్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 114 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి.

ఆదివారం పాట్నాలో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యే సమావేశానికి ముగ్గురు జేడీయూ సభ్యులు గైర్హాజరవ్వటం కలకలం రేపింది. అయినప్పటికీ..నేడు జరగబోయే బలపరీక్షలో గెలుస్తామని సీఎం నితీశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహాగట్‌బంధన్‌ (ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎంఎల్‌)), ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలందర్నీ తేజస్వీ యాదవ్‌ గృహ నిర్బంధంలో ఉంచారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తమని చెబుతూ ఆర్జేడీ..సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా గయలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ఆదివారం ప్రత్యేక బస్సులో పాట్నాకు చేరుకున్నారు. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీ-78, జేడీయూ-45, హెచ్‌ఏఎం(ఎస్‌)-4, ఐఎన్‌డీ-1లతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 128 మంది ఎమ్మెల్యేల బలమున్నట్టు సమాచారం. మహాగట్‌బంధన్‌ పేరుతో ఒక్కటైన ఆర్జేడీ-79, కాంగ్రెస్‌-19, సీపీఐ(ఎంఎల్‌)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది.

ఇదిలా ఉండగా, ఆట ఇంకా ముగియలేదని బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే సమయంలో జేడీయూకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆదివారం నితీశ్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైనట్టు సమాచారం. మంత్రి శ్ర‌వ‌ణ్ కుమార్ నివాసంలో ఇచ్చిన విందుకు ప‌లువురు ఎమ్మెల్యేలు గైర్హాజ‌రయ్యారు. సీఎం నితీష్ కుమార్ సైతం అక్క‌డ ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేదు


Tags

Read MoreRead Less
Next Story