Pollution Effect : ఢిల్లీలో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం

Pollution Effect : ఢిల్లీలో 50శాతం సిబ్బందికి వర్క్ ఫ్రం హోం
కాలుష్యంలో వరల్డ్ నంబర్ 1 ఢిల్లీ

ఢిల్లీ నగరం కాలుష్య కాసారంగా మారింది. గాలి నాణ్యత మళ్లీ ‘సివియర్‌ ప్లస్‌’ కేటగిరీకి పడిపోవడంతో దేశంలోనే అత్యంత కలుషిత నగరంగా తయారైంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రియల్‌ టైమ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) 500కు పైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏక్యూఐ స్థాయి 400 కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిషేధించాలని ఆదేశించింది. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, పైప్‌లైన్ల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం విధించింది. కాలుష్య కారక ట్రక్కులు, వాణిజ్య వాహనాలు రాజధానిలోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీలో భవన నిర్మాణాలను నిలిపివేశారు.


నిత్యావసర సరుకులు తీసుకెళ్లే వాహనాలు మినహా ఇతర రాష్ట్రాల ఉంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌6 వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిస్తారు. కాగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం 5వ తరగతి వరకూ అన్ని పాఠశాలల మూసివేతను ఈ నెల 10 వరకూ పొడిగించింది. 6 నుంచి 12వ తరగతి వరకూ పాఠశాలలు మూసివేయాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించుకొనే వెసులుబాటు కల్పించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ప్రకటించారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రకారం బేసి-సరి ప్రాతిపదికన వాహనాలను అనుమతించడం వంటి అదనపు అత్యవసర చర్యలు తీసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లో గడ్డివాములను కాల్చే సంఘటనల పెరుగుదల కారణంగా ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత దిగజారింది. వాయు కాలుష్య సంక్షోభం ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లోని పలు నగరాల్లో కూడా ప్రమాదకరమైన వాయు కాలుష్యం పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story