Muslim World League: ముస్లిమ్ లు భారత పౌరులమని గర్విస్తున్నారు

Muslim World League: ముస్లిమ్ లు భారత పౌరులమని గర్విస్తున్నారు
యావత్‌ విశ్వానికే భారత్‌ శాంతి సందేశం ఇవ్వగలదన్న వరల్డ్‌ ముస్లిం లీగ్‌... సహ జీవనానికి భారత్‌ ఓ గొప్ప నమూనాగా అభివర్ణన

యావత్ విశ్వానికే భారత దేశం.. శాంతి సందేశం ఇవ్వగలదని ప్రపంచ ముస్లింలకు ప్రాతినిథ్యం వహించే వరల్డ్ ముస్లిం లీగ్ తెలిపింది. భిన్నత్వంతో అలరారే భారత్, సహ జీవనానికి ఓ గొప్ప నమూనా అని ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ డాక్టర్ మహ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇస్సా అన్నారు. అల్‌ ఇస్సా సౌదీ అరేబియా న్యాయ శాఖ మంత్రిగానూ గతంలో పని చేశారు. భారత ముస్లింలు వారి దేశ రాజ్యాంగం పట్ల, ఇక్కడ నెలకొన్న సౌభ్రాత్రుత్వం పట్ల గర్విస్తున్నారని ఆయన అన్నారు. భారత్‌కు ఆరు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన.. ఢిల్లీలో ఖుస్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.


భారతీయ విజ్ఞానం గురించి ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నామని, అది యావత్ మానవాళికి మంచి చేస్తోందని అల్‌ ఇస్సా అన్నారు. ఎన్నో వైవిధ్యాలున్నప్పటికీ భారత్ స్థిరంగా ఉందనీ ప్రపంచంలో అలాంటి పరిస్థితులు నెలకొనేలా పనిచేస్తామన్నారు. భారత ఐక్యతను ముస్లిం సమాజం ప్రశంసిస్తుందని అన్నారు. తాము భారత పౌరులమని ఇక్కడి ముస్లింలు గర్విస్తున్నారని అల్‌ ఇస్సా వ్యాఖ్యానించారు. శాంతియుతంగా కలిసి జీవించాలనే సందేశాన్ని భారత్‌ ప్రపంచానికి అందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, సామరస్యాన్ని పెంపొందించడానికి తాము కృషి చేస్తామని ముస్లిం వరల్డ్ లీగ్ చీఫ్‌ తెలిపారు. కేవలం మాటలలో కాకుండా సహ జీవనంతో ప్రపంచానికి భారత్ దారి చూపిందని అల్‌ ఇస్సా అన్నారు. నాగరికతల మధ్య ఘర్షణ అనివార్యమన్న ఆయన.. ప్రపంచాన్ని నిరాశావాద సిద్ధాంతం వెంటాడుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి సహకారంతో ముస్లిం వరల్డ్ లీగ్ తూర్పు-పశ్చిమ దేశాల మధ్య అనుసంధానాన్ని నిర్మిస్తుందని అన్నారు.


మానవాళిని రక్షించడానికి శాంతి, సామరస్యంతో జీవించడం చాలా అవసరమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అన్నారు. ఇస్లాం మతం గురించి వరల్డ్‌ ముస్లిం లీగ్‌ మెరుగైన అవగాహన కల్పిస్తుందన్నారు. యువ మనస్సులను పీడించే తీవ్రవాద, రాడికల్ భావజాలాలను నిరోధించాలని సూచించారు. మత, జాతి, సాంస్కృతిక గుర్తింపులతో సంబంధం లేకుండా ప్రపంచంలో మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారతదేశం నిలయంగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ అభిప్రాయాలు, ఆలోచనలు, పరస్పర సహకారం, సంస్కృతులు, నమ్మకాలు, అభ్యాసాల సమ్మేళనాలను స్వీకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని అజిత్‌ డోబల్‌ అన్నారు. ఆరు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న అల్‌ ఇస్సా.. సర్వమత సామరస్యాన్ని వ్యాప్తి చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story