Delhi: ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. సున్నాకి చేరిన విజిబిలిటీ

Delhi: ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. సున్నాకి చేరిన విజిబిలిటీ
ఆలస్యంగా నడిచిన విమానాలు, రైళ్లు..

దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. రోడ్లపై విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో కూడా దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనూ పాలమ్‌ అబ్జర్వేటరీ ఉదయం 5 గంటలకు దట్టమైన పొగమంచుతో దృశ్యమాన్యత స్థాయిలు సున్నామీటర్లకు పడిపోయాయి. ఏడు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

గంగానగర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, పాలం, సఫ్దర్‌జంగ్, బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ మరియు తేజ్‌పూర్‌లు ఈ శీతాకాలంలో మొదటిసారిగా జీరో మీటర్ విజిబిలిటీని నమోదు చేశారు. ఇది ప్రయాణీకులకు ఇబ్బందికరంగా మారింది. పూర్నియా, దిబ్రూఘర్, కైలాషహర్ మరియు అగర్తల వంటి ప్రాంతాల్లో దృశ్యమానత 25 మీటర్లకు పడిపోయింది. హైవేలపై ప్రయాణించే వారు తమ ప్రయాణాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మరియు ఫాగ్ లైట్లను ఉపయోగించాలని ఐఎండీ సూచించింది. ప్రమాదకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేకించి ఎక్స్‌ప్రెస్‌వేలలో.. విజిబిలిటీ మెరుగుపడే వరకు ప్రయాణాలను నిలిపివేయాలని కోరింది.


దట్టమైన పొగమంచు కురియడం వల్ల ఢిల్లీ వెళ్లవలసిన 7 విమానాలు సహా 44 విమానాలు బయల్దేరడం ఆలస్యమైందని, కొన్ని విమానాలు మధ్యలో బెంగళూరులో దిగడంలో నగరంలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే విశాఖలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ నుంచి ఢిల్లీ, విజయవాడ, ముంబయి, హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని, పొగమంచులో విమానాలు నడపలేమని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిణామంతో ప్రయాణికులు మండిపడ్డారు. సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు సకాలంలో వెళ్లకుండా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలంటూ ఎయిరిండియా, ఇండిగో విమాన సంస్థల అధికారులను నిలదీశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story