కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి

కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో వాయువ్య ప్రాంతంలో పడవ బోల్తా పడి 27 మంది మరణించారు. మరో 70 మందికి పైగా కనపడకుండా తప్పిపోయారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. మరోవైపు ప్రాణాలతో బయటపడిన వారి కోసం గజ ఈతగాళ్లు వెతుకులాట ప్రారంభించారు. పడవ ఈక్వేటూర్ ప్రావిన్స్‌లోని బండకా నగరంలో 100 మందికి పైగా ప్రయాణీకులను కాంగో నది వెంబడి బొలోంబా పట్టణానికి తరలిస్తుండగా బోల్తా పడిందని డిప్యూటీ ప్రావిన్షియల్ గవర్నర్ టేలర్ న్గాంజీ తెలిపారు.

ఇప్పటికే 27 మంది బాధితుల మృతదేహాలు నదీ జలాల నుంచి వెలికి తీశారు. మృతదేహాలను స్థానిక జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామని ఆయన చెప్పారు, ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో దేశంలోని సరస్సులు, నదుల్లో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అలాగే తరచుగా లిమిట్ కి మించి ప్రయాణికులు పడవలు ఎక్కడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశంలోని వాయువ్య ప్రాంతంలోని జనాభాలో అత్యధికులు మంచి రోడ్లు లేకపోవడం వల్ల తక్కువ ఖర్చుతో కూడుకున్నందున నదుల్లో పడవ ప్రయాణాలకు ప్రాధాన్యమిస్తున్నారు. పడవ ప్రమాదాలను నివారించడానికి కాంగో ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాత్రి ప్రయాణాలను నిషేధించింది.

Next Story