Polavaram: దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం: కేంద్రం

Polavaram: దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం: కేంద్రం

పోలవరం ప్రాజెక్టుపై పార్లమెంట్‌ సాక్షిగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తి కానట్లే కనిపిస్తోంది. 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 17 వేల 144 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు ఖర్చును భరించేందుకు కూడా కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం తెలపలేదు. 10 వేల 911 కోట్లు చెల్లించేందుకు ఆర్థికశాఖ అంగీకరించింది. వరదల కారణంగా జరిగిన నష్టం కింద మరో 2 వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. అయితే ఈ ప్రతిపాదనల్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉంది. ఇప్పటిదాకా ఉన్న కాలక్రమం ప్రకారం 2024 జూన్‌ కల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. కానీ 2020-2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో పోలవరానికి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.

Next Story