CWC2023: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చిత్తు

CWC2023: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చిత్తు
ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన అఫ్గానిస్థాన్‌... 69 పరుగుల తేడాతో విజయభేరీ

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. గత ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచి... ఈసారి కూడా ప్రపంచకప్‌ను సాధించాలన్న పట్టుదలతో భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటీష్‌ జట్టును... పసికూన అఫ్గానిస్థాన్‌ చిత్తుచేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ అఫ్గాన్‌ స్పిన్నర్ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. అఫ్గాన్‌ 69 పరుగుల తేడాతో ఇంగ్లాడ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ (80; 57 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు. ఇక్రమ్ (58; 66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ (28; 16 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్‌ వుడ్ 2, లివింగ్‌ స్టోన్, జోరూట్, టాప్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు.


అనంతరం 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ జట్టును అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్లు చావుదెబ్బ కొట్టారు. ఆది నుంచే షాక్‌లు తగిలాయి. ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లో తొలి బంతికి జానీ బెయిర్‌స్టోను పేసర్ ఫారూఖీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్‌ను స్పిన్నర్‌ ముజిబుర్‌ రెహ్మన్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. మలన్‌.. ఇబ్రహీం జాద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బట్లర్‌ను నవీనుల్ హక్‌ ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మహ్మద్‌ నబీ (2/16), ముజీబుర్‌ రెహ్మన్‌ (3/51), రషీద్‌ఖాన్ (37/3) ప్రత్యర్థి జట్టును గట్టి దెబ్బకొట్టారు. టెయిలెండర్లు ఆదిల్ రషీద్‌, మార్క్‌వుడ్‌లను రషీద్‌ఖాన్‌ తన వరుస ఓవర్లలో వెనక్కి పంపడంతో ఇంగ్లాండ్ ఆలౌటైంది.


ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ (66; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే పోరాడాడు. డేవిడ్ మలన్ (32) పరుగులు చేశాడు. జానీ బెయిర్‌ స్టో (2), జో రూట్ (11), జోస్ బట్లర్ (9), లియామ్ లివింగ్ స్టోన్ (10), సామ్ కరన్ (10) వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. ఆఖర్లో టెయిండర్లు ఆదిల్ రషీద్‌ (20; 13 బంతుల్లో 2 ఫోర్లు), మార్క్‌వుడ్ (18; 22 బంతుల్లో 3 ఫోర్లు), రీస్ టాప్లీ (15*; 7 బంతుల్లో 3 ఫోర్లు) పోరాడినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.

Tags

Read MoreRead Less
Next Story