CWC 2023: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ

CWC 2023: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ
శ్రీలంకపై ఘన విజయం... 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కంగారులు..

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన కంగారు జట్టు... శ్రీలంకపై ఘన విజయం సాధించి గొప్పగా పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కంగారు జట్టు పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు కుశాల్‌ పెరీరా, నిశాంక అదిరే ఆరంభాన్నిచ్చారు. 10 ఓవర్లలో 51/0తో నిలిచిన లంక.. 21 ఓవర్లలో 121/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఎట్టకేలకు 22వ ఓవర్లో కంగారు బౌలర్లు ఫలితం రాబట్టాడు. నిశాంకను ఔట్‌ చేయడం ద్వారా కమిన్స్‌ ఆసీస్‌కు తొలి వికెట్‌ను అందించాడు. అయిదు ఓవర్ల తర్వాత అతడే పెరీరాను బౌల్డ్‌ చేశాడు. ఈ రెండు వికెట్ల తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అక్కడి నుంచి కంగారూల ఆధిపత్యం మొదలైంది. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా చూస్తుండగానే లంకను ఆలౌట్‌ చేసింది. జంపా వరుస ఓవర్లలో కుశాల్‌ మెండిస్‌ (9), సమరవిక్రమ (8)లను ఔట్‌ చేయడం ద్వారా లంకేయుల వెన్నువిరిచాడు. ధనంజయ (7)ను స్టార్క్‌ బౌల్డ్‌ చేయగా.. వెల్లలాగె (2) రనౌటయ్యాడు. ఆ తర్వాత కరుణరత్నె (2), తీక్షణ (0), లహిరు కుమార (4) పెవిలియన్‌కు క్యూ కట్టారు. వికెట్లు పడుతున్నా కాస్త పట్టుదలను ప్రదర్శించిన అసలంక (25).. ఆఖరికి పదో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. లంక 84 పరుగుల వ్యవధిలో మొత్తం పది వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు, అసలంక కాకుండా మరే బ్యాటర్‌ కూడా రెండంకెల స్కోరు చేయలేదు.


స్వల్ప లక్ష్యమే అయినా.. ఛేదన మొదట్లో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. కానీ ఒత్తిడిలో సూపర్‌గా బ్యాటింగ్‌ చేసిన మార్ష్‌, లబుషేన్‌, ఇంగ్లిస్‌ ఆ జట్టును గట్టెక్కించారు. ఓపెనర్లు మార్ష్‌, వార్నర్‌ దూకుడుతో తొలి మూడు ఓవర్లలో 24 పరుగులు చేసిన ఆసీస్‌కు నాలుగో ఓవర్లో మదుశంక (3/38) షాకిచ్చాడు. వార్నర్‌, స్మిత్‌లు ఇద్దరినీ అతడు వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్‌ ఒత్తిడిలో పడింది. ఆపై తొలి బంతికే లబుషేన్‌ క్యాచ్‌ ఔటైనట్లు ప్రకటించడంతో ఆ జట్టుకు చెమటలు పట్టాయి. కానీ సమీక్షలో లబుషేన్‌ బతికిపోవడంతో కంగారూ జట్టు ఊపిరిపీల్చుకుంది. లహిరు కుమార బంతి లబుషేన్‌ బ్యాట్‌ను తాకలేదని రీప్లేల్లో తేలింది. ప్రమాదం నుంచి బయటపడ్డ లబుషేన్‌ ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచాడు. 14వ ఓవర్లలో 79/2తో ఆసీస్‌ కోలుకుంది. కానీ అంతా సాఫీగా సాగుతున్న దశలో మార్ష్‌ రనౌటయ్యాడు. ఆ దశలో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అతడు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీలైనప్పుడల్లా బౌండరీ సాధించగా.. లబుషేన్‌ ఎక్కువగా సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 158 వద్ద లబుషేన్‌ ఔటైనా.. అప్పటికే ఆస్ట్రేలియా కోలుకుంది. కంగారుపడాల్సిన అవసరం లేకపోయింది. ఇంగ్లిస్‌కు తోడైన మ్యాక్స్‌వెల్‌ (31 నాటౌట్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో ఆసీస్‌ వేగంగా లక్ష్యం దిశగా సాగింది. చివర్లో ఇంగ్లిస్‌ ఔటైనా.. స్టాయినిస్‌ (20 నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ లాంఛనం పూర్తి చేశారు. ఇంగ్లిస్‌ (58; 59 బంతుల్లో 5×4, 1×6), మిచెల్‌ మార్ష్‌ (52; 51 బంతుల్లో 9×4), లబుషేన్‌ (40; 60 బంతుల్లో 2×4) రాణించడంతో లక్ష్యాన్ని ఆసీస్‌ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జంపా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును గెలుచుకున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story