CWC2023: బంగ్లా చేతిలోనూ తప్పని ఓటమి

CWC2023: బంగ్లా చేతిలోనూ తప్పని ఓటమి
కొనసాగుతున్న శ్రీలంక పరాజయాల పరంపర... బంగ్లా చేతిలోనూ ఓటమి

ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్‌ శ్రీలంకపై బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత లంకను 49.3 ఓవర్లలో 279 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటర్లు 41.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. బంగ్లా బ్యాటర్లలో శాంటో 90 పరుగులు, షకీబుల్‌ హసన్‌ 82 పరుగులతో రాణించారు. వీరిద్దరి విలువైన భాగస్వామ్యంతో బంగ్లాదేశ్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా విజయంతో చరిత్‌ అసలంక అద్భుత శతకం వృథా అయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే షోరిఫుల్ ఇస్లాం శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. 5 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన కుశాల్‌ పెరీరాను అవుట్‌ చేశాడు. అనంతరం పాతుమ్‌ నిసంక, కుశాస్ మెండిస్‌ లంకను ఆదుకున్నారు. రెండో వికెట్‌కు కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షకీబుల్‌ హసన్‌ విడదీశాడు. 30 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్సుతో 19 పరుగులు చేసిన కుశాల్‌ను షకీబుల్‌ అవుట్‌ చేశాడు.


బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న సధీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించారు. కానీ సధీర సమరవిక్రమను షకీబుల్‌ హసన్‌ అవుట్‌ చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి సధీర సమరవిక్రమ అవుటయ్యాడు. దీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో లంకకు ఎదురుదెబ్బ తగిలింది. 135 పరుగులకు లంక అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చరిత్‌ అసలంక105 బంతుల్లో ఆరు ఫోర్లు, అయిదు సిక్సులతో అసలంక 108 పరుగులు చేశాడు. అసలంక పోరాటంతో 49.3 ఓవర్లలో లంక 279 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్‌ షకీబ్‌ 3, షోరిఫుల్ ఇస్లాం 2, షకీబుల్‌ హసన్‌ రెండు వికెట్లు తీశారు.

280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద తన్జీద్‌ హసన్‌ అవుటయ్యాడు. 41 పరుగుల వద్ద లిట్టన్‌ దాస్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో బంగ్లా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపించింది. కానీ హసన్ శాంటో 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు, షకీబుల్‌ హసన్‌ 65 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సులతో 82 పరుగులు చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బంగ్లా అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. తర్వాత వీరిద్దరూ అవుటైనా బంగ్లాదేశ్‌కు ఎలాంటి కష్టం కాలేదు. అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటర్లు 41.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు.

Tags

Read MoreRead Less
Next Story