Barcelona vs Real Madrid: ఎల్ క్లాసికోలో బార్సిలోనాదే విజయం

Barcelona vs Real Madrid: ఎల్ క్లాసికోలో బార్సిలోనాదే విజయం
బార్సిలోనా మొదటి గోల్‌ని ఉస్మాన్ డెంబెల్ అందించాడు. 15వ నిమిషంలో పెడ్రీ నుంచి బాల్ అందుకుని సింగిల్‌ కిక్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

క్రికెట్‌ అభిమానులకు భారత్, పాకిస్థాన్‌ దేశాల మధ్య మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠ, వైరం ఉంటుందో అలాగే క్లబ్‌ ఫుట్‌బాల్‌లో స్పెయిన్‌కి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ జట్లైన బార్సిలోనా, రియల్‌ మాడ్రిడ్ జట్ల మధ్య వైరం, తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌ను ఎల్ క్లాసికో(El Classico) అని పిలుస్తారు. స్పెయిన్‌లోని లాలిగా టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు టైటిల్ కోసం పోటీ పడుతుంటాయి. అది లీగ్‌ మ్యాచైనా, ఛాంపియన్స్‌ లీగ్ మ్యాచ్‌ అయినా ఆటగాళ్లు హోరా హోరీగా తలపడుతుంటారు. ఈ రోజు జరిగిన ఫ్రెండ్లీస్ మ్యాచ్‌ కూడా వాటికి తక్కువ కాకుండా సాగింది. ఆటగాళ్ల మధ్య గొడవ, గోల్‌ కొట్టినపుడు సంబురాలతో అభిమానులకు టికెట్ వసూల్ అయ్యే ప్రదర్శన చేశారు.

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ప్రీ సీజన్‌కు ముందు వివిధ దేశాల్లో క్లబ్ జట్లు తలపడుతుంటాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఎఫ్‌సీ బార్సిలోనా జట్లు 3-0 గోల్స్‌ తేడాతో తన ఇష్టమైన ప్రత్యర్థి రియల్‌ మాడ్రిడ్‌పై ఘన విజయం సాధించింది. బార్సిలోనా నుంచి ఉస్మాన్ డెంబెల్‌ 1 గోల్ చేయగా, ఫర్మిన్ లోపెజ్, ఫెరాన్ టోరెస్‌లు తలా ఓ గోల్ సాధించారు.

మొదటి నుంచే ఇరు జట్లు గోల్‌పోస్టులపై దాడులతో హోరాహోరీగా సాగింది. 4వ నిమిషంలో బార్సిలోనా ప్లేయర్ కొట్టిన ఓ చూడచక్కని కిక్ గోల్‌పోస్ట్ బార్‌కి తాకడంతో గోల్ మిస్సయింది. బార్సిలోనా మొదటి గోల్‌ని ఉస్మాన్ డెంబెల్ అందించాడు. 15వ నిమిషంలో పెడ్రీ నుంచి బాల్ అందుకుని సింగిల్‌ కిక్‌తో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. 19వ నిమిషంలో మాడ్రిడ్‌కి వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని చేజేతులా జార్చుకుంది. మాడ్రిడ్ ప్లేయర్ ఇచ్చిన పాస్‌ పెనాల్టీ ఏరియాలో బార్సిలోనా ప్లేయర్ చేతికి తాకడంతో అంపైర్ పెనాల్టీ అవకాశం ఇచ్చాడు. విన్సియస్ జూనియర్ మిస్‌ చేశాడు.


రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు దూకుడుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దాడులు చేశారు. వారికి అదృష్టం కలిసిరాలేక వారు కొట్టిన 2 షాట్‌లు బార్‌లకు తాకడంతో గోల్‌ కాకుండా పోయాయి.

2వ అర్ధభాగంలోనూ ఆధిక్యాన్ని సాగించిన బార్సిలోనా 85వ నిమిషంలో లోపెజ్ అద్భుతమైన షాట్‌కి గోల్‌ కీపర్ డైవ్ చేసినప్పటికీ మరో గోల్ సాధించింది. అదనపు సమయంలో 91వ నిమిషంలో టోరెస్‌, మాడ్రిడ్ కీపర్ కోర్టియస్‌ను బోల్తా కొట్టిస్తూ మరో గోల్‌ కొట్టడంతో బార్సిలోనా విజయం ఖరారైంది.


Tags

Read MoreRead Less
Next Story