AGARKAR: అగార్కర్‌కే సెలక్షన్‌ పగ్గాలు

AGARKAR: అగార్కర్‌కే సెలక్షన్‌ పగ్గాలు
టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా అగార్కర్‌ నియామకం... ఏకగ్రీవంగా ఖరారు చేసిన క్రికెట్‌ సలహాదారుల కమిటీ..

మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు. జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు చైర్మన్‌గా 45 ఏళ్ల అగార్కర్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. అగార్కర్‌కు వర్చువల్‌గా ఇంటర్వ్యూ నిర్వహించిన సులక్షణా నాయక్‌, అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపేలతో కూడిన క్రికెట్‌ సలహాదారు కమిటీ... ఏకగ్రీవంగా అతడి పేరును ఖరారు చేసిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. సెలెక్టర్ల ప్యానెల్‌లో ఇప్పటికే శివ్‌సుందర్‌ దాస్‌, సలీల్‌ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శరత్‌ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు చైర్మన్‌ హోదాలో ఐదో సభ్యుడిగా అగార్కర్‌ చేరాడు. మిగతా సెలక్టర్లతో పోలిస్తే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న అతడినే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించిందని జై షా తెలిపాడు. అగార్కర్‌ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ వెస్టిండీస్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు జట్టును ఈ వారం చివర్లో ఎంపిక చేయనుంది.


అగార్కర్‌ 1998-2007 మధ్య 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు. అగార్కర్‌ 1999, 2003, 2007 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత జట్టు సభ్యుడు. 2007 టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన జట్టులోనూ అతనున్నాడు. ప్రధానంగా బౌలరే అయినప్పటికీ.. లార్డ్స్‌లో టెస్టు శతకం సాధించిన అరుదైన ఘనతను అగార్కర్‌ సొంతం చేసుకున్నాడు. అంతే కాక భారత్‌ తరఫున వన్డేల్లో వేగవంతమైన అర్ధశతకం సాధించిన రికార్డు కూడా అగార్కర్‌దే. 2000లో జింబాబ్వేపై అతను కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. 2004లో ఆస్ట్రేలియాపై అడిలైడ్‌ టెస్టులో భారత్‌ సాధించిన చారిత్రక విజయంలో అగార్కర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 6 వికెట్లతో అగార్కర్‌ చెలరేగిపోయాడు. రిటైర్మెంట్‌ తర్వాత అగార్కర్‌ చాలా ఏళ్ల నుంచి క్రికెట్‌ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.


కొన్ని నెలల కిందట చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ భారత జట్టులో పలువురు ఆటగాళ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో బయటికి రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు. ఇప్పుడా స్థానాన్ని అజిత్‌ అగార్కర్‌ భర్తీ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story