Ashes Test: బెన్‌స్టోక్స్ అత్యద్భుత పోరాటం వృథా..

Ashes Test: బెన్‌స్టోక్స్ అత్యద్భుత పోరాటం వృథా..

యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ హీరోచిత ఇన్నింగ్స్ వృథా అయింది. టెస్టుల్లో అత్యుత్తమం అనదగ్గ మరోసారి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 155 పరుగులు చేసి జట్టును విజయతీరాల దాకా చేర్చాడు. కానీ అది వృథా ప్రయాసే అయింది. కీలక సమయంలో ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 43 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచిందన్న మాటే గాని అందరూ గుర్తుంచుకునేది బెన్‌స్టోక్స్ ఇన్నింగ్స్, ఇతర వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలే.

5వ రోజు 6 వికెట్లు చేతిలో పెట్టుకుని 257 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ని ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్‌ఉడ్, పాట్‌ కమిన్స్ తమ పేస్‌తో ఇబ్బందులు పెట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెన్‌ డకెట్, బెన్‌స్టోక్స్‌ ఎంతో పట్టుదలతో వారిని ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. బెన్‌స్టోక్స్ వెనువెంట బౌండరీలతో ఇన్నింగ్స్‌కి ఊపు తెచ్చాడు. బెన్‌స్టోక్స్ 99 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 5వ వికెట్‌కి 100 పరగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం 177 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బెన్ డకెట్‌ (83) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కీపర్ బెయిర్‌స్టో 2 బౌండరీలతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కామెరూన్ బౌలింగ్‌లో వివాదాస్పద రీతిలో రనౌటై వెనుదిరిగాడు.


ఇక ఆస్ట్రేలియా గెలుపు సులువే అనుకున్నారంతా. కానీ బెన్‌స్టోక్స్ వరుస బౌండరీలు, సిక్స్‌లతో స్కోర్‌బోర్డును ఉరకలెత్తించాడు. ఇంగ్లాండ్‌ని మళ్లీ పోటీలోకి తెచ్చాడు. గ్రీన్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 6, 6, 6 లు కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఇది స్టోక్స్‌కి టెస్టుల్లో 13వ సెంచరీ. ఈ క్రమంలో ఛేదించాల్సిన లక్ష్యం క్రమంగా తగ్గుతూ 100 పరుగుల కిందకి వచ్చింది. అవతలి ఎండ్‌లో ఉన్న స్టువర్స్ బ్రాడ్ సంపూర్ణ సహకారం అందించాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో 155 పరుగుల వద్ద స్టోక్స్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియాకి విజయం సులువయింది. అప్పటికి ఛేదించాల్సిన పరుగులు 70 పరుగులు మాత్రమే. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ మరో 26 పరుగులు మాత్రమే జోడించి వెనువెంటనే వెనుదిరగడంతో ఆస్ట్రేలియా సంబురాల్లో మునిగితేలింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 5 టెస్టుల సిరీస్‌లో 2-0 తో ముందంజలో ఉంది.

బెన్‌స్టోక్స్‌కి అలవాటైన అద్భుత పోరాటం..

టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్ స్టోక్స్ 2019లో లీడ్స్‌లో జరిగిన యాషెస్ టెస్ట్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో గెలవదనుకున్న స్థితి నుంచి అన అద్భుతమైన పోరాటపటిమతో జట్టును గెలిపించాడు. 359 పరుగుల లక్ష్య ఛేదనలో 135 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కి చిరస్మరణీయమైన విజయాన్నందిచాడు. ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికీ నిన్నటి టెస్ట్ ఇన్నింగ్స్‌ కూడా టెస్టుల్లో ఉత్తమమైనదనడంలో సందేహం లేదు.

Benstokes

ఈ మ్యాచ్‌లో పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా మ్యాచ్‌ని శాసించాయి. ఇంగ్లాండ్ కీపర్-బ్యాట్స్‌మెన్‌ క్రీజు నుంచి బయటికి రావడం చూసి వికెట్లని అలెక్స్ కారే పడగొట్టడంతో అంపైర్లు బెయిర్‌స్టోని అవుట్‌గా ప్రకటించారు. 4వ రోజు ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ పట్టిన క్యాచ్ నేలకు తాకిందని అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడం కూడా విమర్శలకు తావిచ్చింది.





Tags

Read MoreRead Less
Next Story