BEDI DIES: క్రికెట్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ ఇకలేరు

BEDI DIES: క్రికెట్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ  ఇకలేరు
67 టెస్టులు ఆడిన స్పిన్‌ మాంత్రికుడు... 22 టెస్టులకు కెప్టెన్‌గా చేసిన బేడీ

భారత క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. గత కొంత కాలంగా బేడీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశంలో గొప్ప లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ దిగ్గజంగా పేరుగాంచిన బిషన్‌సింగ్ బేడీ 1966 నుంచి 1979 వరకు భారత క్రికెట్‌ జట్టుకు టెస్టులు, వన్డేల్లో ప్రాతినిథ్యం వహించారు. కెరీర్‌లో 67 టెస్టులు ఆడిన బేడీ 266 వికెట్లు పడగొట్టారు. 10 వన్డేల్లో 7 వికెట్లు తీశారు. 22 టెస్టుల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. టెస్టుల్లో ఐదు వికెట్ల విన్యాసాన్ని 14 సార్లు, 10 వికెట్లను ఒకసారి బేడీ తీశారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్‌ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్‌లో బేడీ తనదైన ముద్ర వేశారు. 1979 జూన్ 16వ తేదీనన ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో శ్రీలంకతో తన చివరి వన్డే ఆడారు.


రిటైర్‌ అయిన తర్వాత 1990లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ టూర్లకు భారత క్రికెట్‌ జట్టుకు మేనేజర్‌గా బేడీ వ్యవహరించారు. నేషనల్‌ సెలక్టర్‌గా కూడా పని చేశారు. మనీందర్‌ సింగ్‌, మురళీ కార్తీక్‌ వంటి ప్రతిభ కలిగిన స్పిన్నర్లకు మెంటర్‌గా కూడా బేడీ వ్యవహరించారు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరు బేడీకి ఉంది. క్రీడారంగంలో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2004లో సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. బేడీకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


బిషన్ సింగ్ బేడీ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ను 406 పరుగుల రికార్డుతో గెలుచుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత బిషన్ సింగ్ బేడీ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి కంగారూలను ఇబ్బందుల్లోకి నెట్టాడు.టెస్టు మ్యాచ్‌లో ఒకసారి 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అలాగే బిషన్ సింగ్ బేడీ 14 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. టెస్ట్ మ్యాచ్‌లు కాకుండా బిషన్ సింగ్ బేడీ 10 వన్డే మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ వన్డే ఫార్మాట్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో బిషన్ సింగ్ బేడీ సగటు 48.57గా ఉంది. క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల...... ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. క్రికెట్ పట్ల బేడీకి ఉన్న అభిరుచి అచంచలమైందన్న మోదీ తన స్పిన్ బౌలింగ్ తో భారత్ కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతంగా నిలుస్తారని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్రికెట్ లో ఆయన సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుంటాయని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

క్రికెట్ ప్రేమికులు 'ది సర్దార్ ఆఫ్ స్పిన్' అంటూ ముద్దుగా పిలుచుకొనే క్రికెటర్లలో బిషన్ సింగ్ ఒకరని., ఆయన మరణ వార్త చాలా బాధించిదని కాంగ్రెస్ అధ్యక్షుడు..మల్లికార్జున ఖర్గే అన్నారు. క్రీడలు, జీవితం గురించి ఎంతో నేర్పించిన బిషన్ సింగ్ బేడీని ఎప్పటికీ మిస్ అవుతానని షారుఖ్ ఖాన్ అన్నారు. క్రికెట్ ఈ రోజు ఒక లెజెండ్ ను కోల్పోయిందని సంజయ్ దత్ పేర్కొన్నారు. బేడీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన గౌతమ్ గంభీర్ క్రికెట్ కు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story