Wimbledon: వింబుల్డన్ కింగ్ అల్కరాజ్, 4 సార్లు ఛాంపియన్ జకోవిచ్‌ ఓటమి

Wimbledon: వింబుల్డన్ కింగ్ అల్కరాజ్, 4 సార్లు ఛాంపియన్ జకోవిచ్‌ ఓటమి
ప్రతిష్టాత్మక వింబుల్డన్‌(Wimbledon) టెన్నిస్ టోర్నీలో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1, నంబర్ 2 ర్యాంకర్ ఆటగాళ్ల మధ్య ఆట మజా ఎలా ఉంటుందో అభిమానులకు తెలిసొచ్చింది. ఎన్నో యేళ్లుగా గ్రాస్ కోర్ట్ కింగ్‌గా ఉంటూ వచ్చిన నొవాక్ జకోవిచ్‌(Novac Djocovic)ని మట్టికరిపిస్తూ, కేవలం 20 యేళ్ల వయసున్న నూతన టైటిల్ హోల్డర్ వచ్చాడు. గత 4 సంవత్సరాలుగా ఎదురులేకుండా వింబుల్డన్‌ గెలుస్తూ వచ్చిన సెర్బియన్ స్టార్ జకోవిచ్‌ని ఓడించి, కప్ ఎగురేసుకుపోయాడు స్పెయిన్‌కి చెందిన ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz). వరుసగా 5వ సారి టైటిల్ గెలవాలనకున్న జకోవిచ్ ఆశలకు గండికొట్టాడీ వరల్డ్ నంబర్ 1 ఆటగాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే ఉత్తమ ఆటల్లో ఒకటిగా నిలవనుంది. వింబుల్డన్‌లో తొలి సెట్ గెలిచిన తర్వాత ఎన్నడూ ఓడని జకోవిచ్‌ని మట్టికరిపించాడు. సుమారు 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన వీరి సమరం కోర్టులో, టీవీల ముందు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది.

ఆదివారం జరిగిన ఫైనల్లో సెర్బియన్ స్టార్ జకోవిచ్‌ని 1-6, 7-6(6), 6-1, 3-6, 6-4 తేడాతో ఓడించి అద్భుత విజయం సాధించాడు. మొదటి సెట్‌ చూసిన వాళ్లంతా జకోవిచ్ ధాటికి, అల్కాజార్‌ నిలవలేడు అనుకున్నారు. తొలి సెట్‌ను కేవలం 32 నిమిషాల్లోనే జకోవిచ్‌కి సమర్పించుకున్నాడు. రెండో సెట్‌లో పుంజుకున్న అల్కరాజ్ 2-1తో బ్రేక్ పాయింట్ సాధించినా, జకోవిచ్‌ కూడా బ్రేక్ పాయింట్‌ సాధించారు. టై బ్రేకర్‌లో హోరాహోరీ సర్వ్‌లతో ఇద్దరు ఆటగాళ్లు అరించినా, అల్కారాజ్‌ పాయింట్‌తో పాటు సెట్‌ గెలిచాడు.


ఇదే ఊపును కొనసాగించిన అల్కారాజ్ 3వ సెట్‌లో జకో తేలిపోయేలా చేశాడు. వరుస బ్రేక్‌ పాయింట్లతో ఆ సెట్‌ని లాగేసుకుని జకోని ఒత్తిడిలోకి నెట్టాడు.

4వ సెట్‌ ముందు షాట్ క్లాక్ పర్యవేక్షణపై అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన జకోవిచ్, అనుకోకుండా టాయిలెట్ బ్రేక్‌ తీసుకున్నాడు. ఈ విరామం కలిసొచ్చిన జకోవిచ్, 4వ సెట్‌ని దక్కించుకుని ఫైనల్‌ని రసవత్తరంగా మార్చాడు. ఈ సెట్‌లో అల్కాజార్‌ 7 డబుల్ ఫాల్ట్‌లు చేయడం జకోకి కలిసొచ్చింది.

ఇక నిర్ణయాత్మ ఫైనల్‌ సెట్‌లో 2-0తో బ్రేక్ పాయింట్ చేసే బంగారు అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం 2-1తో అల్కారాజ్ ఆధిక్యంలో దూసుకెళ్లడంతో జకో అసహనంతో రాకెట్‌ని నేలపై విసిరికొట్టడంతో అంపైర్ల నుంచి వార్నింగ్ అందుకున్నాడు. తర్వాత లీడ్ 3-1కి పెరిగింది. సహనంతో ఆడిన అల్కారాజ్‌, జకోవిచ్ కొట్టిన ఫోర్‌ హ్యాండ్ షాట్‌ నెట్‌కి తగలడంతో ఆనందర భాష్పాలతో గ్రౌండ్‌పై పడ్డాడు. వింబుల్డన్ కిరీటాన్ని అందుకుని చరిత్రలో పేరు లిఖించుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story