ICC Rankings: మహిళల నంబర్ 1గా ఆటపట్టు, 7వ స్థానంలో మంధనా

ICC Rankings: మహిళల నంబర్ 1గా ఆటపట్టు, 7వ స్థానంలో మంధనా
6వ స్థానంలో హర్మన్ ప్రీత్, 7వ స్థానంలో స్మృతి మంధనా

శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ చమారి ఆటపట్టు మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇటీవల కాలంలో శ్రీలంకన్ కెప్టెన్ అద్భుత ఫాంలో ఉంటూ అదరగొడుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌లో 758 పాయింట్లతో, ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెథ్ మూనీని వెనక్కి నెట్టి, నంబర్ 1 ర్యాంక్ సాధించింది. ఈ ఘనత మొట్టమొదటి శ్రీలంక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. పురుషుల, మహిళల క్రికెట్‌లో శ్రీలంక తరఫున ఈ ఫీట్ సాధించిన రెండవ క్రీడాకారిణిగా నిలిచింది. సనత్ జయసూర్య ఇంతకు ముందు నంబర్ 1 ర్యాంక్‌కి చేరిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ ఆటపట్టు 3 మ్యాచుల్లో 248 పరుగులు సాధించి, సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి మ్యాచ్‌లో 108 నాటౌట్, రెండవ మ్యాచ్‌లో 0 పరుగులు చేసింది. చివరి మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లో 9 సిక్స్‌లతో 140 నాటౌట్ పరుగులు చేసి శ్రీలంకకు మరపురాని సిరీస్‌ విజయాన్నందించింది. ఈ మ్యాచ్‌లో ద్వైపాక్షిక సిరీస్‌లో న్యూజిలాండ్‌ని ఓడించడం శ్రీలంకకు అదే మొదటిసారి. ఈ సిరీస్‌లో రాణించడంతోనే ఆటపట్టు బ్యాటింగ్‌లో మొదటిస్థానానికి చేరింది.


ఈ వన్డే సిరీస్‌లో 194 పరుగులు చేసి రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డెవిన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచింది. 5 వికెట్లు తీసిన బౌలర్ల ర్యాంకింగ్‌లో ఫాస్ట్ బౌలర్ లీ తాహుహు 3 స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానానికి చేరింది.


మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధానలు ఒక్కో స్థానం కోల్పోయి వరుసగా 6, 7 స్థానాల్లో నిలిచారు. T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధన తన 3వ స్థానాన్ని పదిలపరుచుకుంది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి తాలియా మెక్‌గ్రాత్ నంబర్ 1 స్థానంలో ఉందది. బౌలర్లలో ఇంగ్లాండ్‌కి చెందిన సోఫీ ఎక్లెస్టోన్ వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ నంబర్ 1 స్థానంలో నిలిచింది. వన్డేల్లో భారత్‌ బౌలర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు 8, 9 స్థానాల్లో ఉన్నారు. T20ల్లో దీప్తి శర్మ, రేణుక సింగ్‌లు 4, 9 స్థానాలతో టాప్-10లో నిలిచారు.




Tags

Read MoreRead Less
Next Story