ENG VS NZ: ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

ENG VS NZ: ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం
సెంచరీలతో కదం తొక్కిన కాన్వే, రచిన్‌ రవీంద్ర... రికార్డు భాగస్వామ్యంతో ఏకపక్ష గెలుపు

వన్డే ప్రపంచకప్‌లో తొలి అడుగును న్యూజిలాండ్‌ బలంగా వేసింది. గత ప్రపంచ కప్‌లో త్రుటిల్లో చేజారిన కప్‌ను ఈసారి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న కివీస్‌.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. గత ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయానికి కివీస్‌ ప్రతీకారం తీర్చుకుంది. డేవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర శతకాలతో చెలరేగడంతో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని మరో 82 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ సునాయసంగా ఛేదించేసింది. 273 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో కాన్వే, రచిన్‌ రవీంద్ర కివీస్‌కు ఘన విజయం అందించారు.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే సిక్స్‌ కొట్టిన బెయిర్‌ స్టో ఈ ప్రపంచకప్‌నకు, ఇంగ్లాండ్‌ టీమ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సమయోచితంగా బ్యాటింగ్‌ చేసిన బ్రిటీష్‌ ఓపెనర్లు ఆరు ఓవర్లలో 35 పరుగులు చేశారు. కానీ జట్టు స్కోరు 40 పరుగుల వద్ద డేవిడ్‌ మలాన్‌ను మ్యాట్‌ హెన్రీ ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో బ్రిటీష్‌ జట్టు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా జో రూట్‌ మాత్రం పోరాడాడు. 86 బంతుల్లో 77 పరుగులు చేసిన రూట్‌ను ఫిలిప్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. టెయిలెండర్లు రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ సాంట్నర్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ తీశారు.


కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లోనే సామ్‌కరణ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ డకౌట్ అవుటయ్యాడు. కానీ ఈ ఆనందం ఇంగ్లాండ్‌కు ఎక్కువసేపు నిలవలేదు. డేవాన్ కాన్వే, వన్‌ డౌన్‌ బ్యాటర్ రచిన్‌ రవీంద్ర.. ఇంగ్లాండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌కు విజయం నల్లేరుపై నడకగా మారింది. కాన్వే ఊచకోతకు ఇంగ్లాండ్‌ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఎన్నిసార్లు బౌలింగ్‌ మార్చినా ఈ భాగస్వామ్యాన్ని విడదీయం బ్రిటీష్‌ బౌలర్ల తరం కాలేదు. కాన్వే 152, రచిన్‌ రవీంద్ర 123 పరుగులతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ విధించిన 282 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేదించింది.

Tags

Read MoreRead Less
Next Story