CWC 2023: ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ కీలక సమరం

CWC 2023: ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ కీలక సమరం
గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన.. ఇరు జట్లకు విజయం కీలకం

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ఇరు జట్లకు విజయం కీలకం కావడంతో మరో ఆసక్తికర మ్యాచ్‌ ఖాయమని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొంటూ గెలుపొందాలని కంగారులు, పాక్ జట్టు ప్రణాళిక రచిస్తున్నాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి చిత్తయిన పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దాన్ని మరచిపోయి ఆసిస్‌పై గెలుపొందాలని బాబర్‌ సేన భావిస్తోంది. మరోవైపు ఆసీస్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆసిస్‌ భారత్‌పై ఓటమితో కంగుతింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా లంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించడం కంగారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.


ప్రారంభం నుంచి ధాటిగా ఆడుతూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలని పాక్‌ భావిస్తోంది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేయం పాక్‌ను కలవరపెడుతోంది. ఫఖర్ జమాన్‌, అబ్దుల్లా షఫీక్‌ భారీ పరుగులు చేయాలని బాబర్‌ సేన కోరుకుంటోంది. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో పాక్‌ సారథి బాబర్ అజమ్ భారీ స్కోరు చేయకపోవడం మేనేజ్‌మెంట్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌పై అర్ధ శతకం చేసిన బాబర్‌... నెదర్లాండ్స్, శ్రీలంకపై తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో బాబర్‌ భారీ స్కోరు చేయాలని పాక్‌ భావిస్తోంది. మహ్మద్ రిజ్వాన్‌పై పాక్ ఎక్కువ ఆధారపడింది. షాహీన్ షా అఫ్రిదిపై పాక్‌ బౌలింగ్‌ భారం ఉంది. ఈ టోర్నమెంట్‌లో షాహీన్‌ షా అఫ్రీదీ పెద్దగా రాణించలేదు.

ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో ఆస్ట్రేలియా కేవలం ఒక్క విజయం సాధించింది. సెమీస్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో కంగారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జోష్ ఇంగ్లిస్ మినహా మరే బ్యాట్స్‌మెన్‌ ఈ ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లిష్‌ మినహా మరే ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ యాభై పరుగులు కూడా చేయలేకపోవడం కంగారు బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తోంది.

ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్), సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం.

Tags

Read MoreRead Less
Next Story