IND-WI: పుజారాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు: హర్భజన్ సింగ్

IND-WI: పుజారాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు: హర్భజన్ సింగ్

టెస్ట్ జట్టులోకి ఛటేశ్వర్ పుజారాని ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సిగ్ విమర్శలు చేశాడు. ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీల యావరేజ్‌లను పోలుస్తూ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. ఎప్పుడూ బౌండరీలు ఆడుతూ, షాట్లు కొట్టే ఆటగాళ్లనే తీసుకుంటే, విదేశాల్లో ఛటేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లే మ్యాచ్‌లను గెలిపిస్తారన్నాడు.

"టెస్ట్ క్రికెట్‌లో ఛటేశ్వర పుజారా సాధించిన వాటి పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. అతను జట్టుకు ఎన్నో సేవలు అందించినప్పటికీ అతన్ని ఎవరూ గుర్తించలేదు. టాప్ ఆర్డర్‌లో జట్టుకు వెన్నెముకలా ఉంటూ వికెట్లు కాపాడే కష్టతరమైన బాధ్యత మోస్తూ, ఇతర బ్యాట్స్‌మెన్ కుదురుకుని పరుగులు చేయడంలో తోడ్పాటునందిస్తాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడిపోవడానికి పుజారా బ్యాటింగే కారణం కాదు. ఇతర బ్యాట్స్‌మెన్, బౌలర్లు విఫలం అయ్యారు. అతనితో పాటు ఆడిన ఇతర బ్యాట్స్‌మెన్ సగటే పుజారాకు ఉంది " అంటూ పరోక్షంగా కోహ్లీ పేరుని వాడినట్లుగా అన్పించింది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పుజారా, కోహ్లీల సగటు 32, 32.13 గా ఉంది. ఏ ఒక్క ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 50 పరుగులు చేయలేదు.


ఇప్పటికీ భారత్‌కు పుజారా అవసరం ఉందని అన్నాడు. "అతడికి తక్కువ స్ట్రైక్‌రేట్ ఎందుకు ఉందో కూడా ఆలోచించాలి. అతని స్ట్రైక్ రేట్ అలా రొటేట్ చేస్తూ, వికెట్లు కాపాడంలో జట్టుకు చాలా సాయం చేస్తున్నాడు. జట్టులో ఏ ఆటగాడి ప్రదర్శన, ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఎప్పుడూ భారీ షాట్లతో ఆడే ఆటగాళ్లను జట్టులో ఉంచలేం. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి విదేశాలకు వెళ్లినపుడు పుజారా లాంటి ఆటగాడు భారత్‌కు అవసరం. "

పుజారాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నాడు. అటువంటి ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం నన్ను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఫైనల్‌ ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటే, అదే మ్యాచ్‌లో ఆడిన ఇతర ఆటగాళ్ల సగటు స్థాయిలోనే పుజారాది కూడా ఉందంటూ పుజారాకు మద్దతు పలికాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని జులై 12 నుంచి జరిగే విండీస్ పర్యటనకు వెళ్లే జట్టు నుంచి పుజారాను తప్పించారు. దీనిపై సీనియర్లు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టెస్టుల్లో 103 మ్యాచులు ఆడిన పుజారా 7195 పరుగులు సాధించి జట్టుకు చాలా కాలం నుంచి కీలకమైన నంబర్ 3 స్థానంలో కొనసాగుతున్నాడు. తన పటిష్టమైన డిఫెన్స్‌తో వికెట్లు కాపాడుతూ ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను గట్టెక్కించాడు.

Tags

Read MoreRead Less
Next Story