IND-PAK: అక్టోబర్ 15న భారత్-పాక్ పోరు, వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల

IND-PAK: అక్టోబర్ 15న భారత్-పాక్ పోరు, వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల




భారత అభిమానులు తమ క్యాలెండర్లలో అక్టోబర్ 15ని మార్క్ చేసుకోవాల్సిందే. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న దాయాది దేశాలు భారత్-పాక్ మధ్య పోరు ఎప్పుడో కూడా ఖరారైంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 2023 వరల్డ్ కప్ షెడ్యూల్ రానే వచ్చింది.

అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ICC ఈరోజే విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ఆరంభమవనుంది. సెమీఫైనళ్లు నవంబర్ 15, 16న ముంబాయి, కోల్‌కతాల్లో జరగనుండగా, ఫైనల్ మ్యాచ్‌కు నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.


2023 Cricket WorldCup Schedule


భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో వరల్డ్ కప్ ఆరంభిస్తుంది. తర్వాత అక్టోబర్ 10న ఆఫ్ఘానిస్తాన్, 15న పాక్‌, 19న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో, 29న ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. తర్వాత నవంబర్ 2న క్వాలిఫయర్-1 టీం, అదే నెల 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ తన చివరి మ్యాచ్ నవంబర్ 11న క్వాలిఫయర్-2 జట్టుతో ఆడనుంది.

అందరి కళ్లూ భారత్-పాక్‌ మ్యాచ్‌ పైనే.. రికార్డులు మన వైపే


సాధారణంగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయిలో ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్‌లో తలపడుతున్నారంటే వారికి పూనకాలే..! ఎన్నో సందేహాలు, చర్చల తర్వాత అక్టోబర్ 15న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు వరల్డ్ కప్‌ల్లో 1996, 1999, 2003, 2011, 2015, 2019 సంవత్సరాల్లో 7 సార్లు తలపడ్డాయి. ఆడిన అన్ని మ్యాచుల్లో భారత్ జయకేతనం ఎగురవేసింది. చివరగా 2019 లో మాంచెస్టర్‌లో తలపడ్డారు. విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన ఈ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ 2011 లో స్వదేశంలో జరిగిన వరల్డ్‌ కప్‌లో ఎంం.ఎస్.ధోనీ సారథ్యంలో ఘన విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ వరల్డ్ కప్‌ కూడా స్వదేశం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టైటిల్ గెలవాలన్న పట్టుదలతో టీం ఇండియా ఉంది.




Tags

Read MoreRead Less
Next Story