Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన 8 మంది భారతీయ 'హాకీ క్వీన్స్' అద్భుత కథలు

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన 8 మంది భారతీయ హాకీ క్వీన్స్ అద్భుత కథలు
ఆటపైనే ధ్యాస. లక్ష్యం చేరుకునే వరకు అలుపెరుగని పోరాటం. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆశ వీడలేదు..

Tokyo Olympics: రాణి రాంపాల్, సవితా పునియా, గుర్జిత్ కౌర్, లాల్రెంసియామి, వందన కటారియా, సలీమా టేట్, దీప్ గ్రేస్ ఎక్కా మరియు సుశీల చాను-టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎనిమిది మంది హాకీ క్వీన్‌లను కలుసుకున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ఓటమిని అంగీకరించక తప్పలేదు. అయినా వారు కనబరిచిన ఆట తీరుకు యావత్ భారతావని శిరసు వంచి నమస్కరించింది. అపారమైన పట్టుదల, దృఢ సంకల్పం‌తో నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆ 8 మంది అమ్మాయిలు. వారి జీవిత ప్రయాణాన్ని ఓసారి పరికిద్దాం.



1. రాణి రాంపాల్

విరిగిన హాకీ స్టిక్‌లతో ప్రాక్టీస్ చేయడం నుండి జాతీయ మహిళల హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలు రాణి రాంపాల్. ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు. అయినా ఆమెకు ఆటపైనే ధ్యాస. తన లక్ష్యం చేరుకునే వరకు అలుపెరుగని పోరాటం. అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఆశ వీడలేదు.. వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ అత్యున్నత ప్రతిభ కనబరుస్తూ అంతర్జాతీయ క్రీడా వేదిక మీద మెరిసిన 'రాణి' రాంపాల్.

రాణి రాంపాల్ తల్లి ఇళ్లలో పని చేసేది. తండ్రి కట్టెలు కొట్టి రోజుకు రూ .80 సంపాదించేవాడు. వాళ్లి ఇంటికి సమీపంలోని హాకీ అకాడమీ ఉండేది. అక్కడ ఆడుతున్న వారిని చూసి తనకు హాకీ నేర్చుకోవాలని ఉందని నాన్నతో చెప్పింది. తినడానికే కష్టంగా ఉన్న బ్రతుకులు మనవి. ఇంక అలాంటి ఆటలు నేనెలా నేర్పించగలను తల్లి అని కూతుర్ని ఊరడించే ప్రయత్నం చేశాడు. కానీ రాణీకి ఎలాగైనా హాకీ నేర్చుకోవాలనే పట్టుదల. రోజూ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ ఆడుతున్న వారిని చూస్తుండేది. తనకూ ఆడాలని ఉన్నా హాకీ స్టిక్ కొనే ఆర్థిక స్థోమత లేదు. విరిగిన హాకీ స్టిక్స్ అడిగి తీసుకుని వాటితోనే ప్రాక్టీస్ చేసేది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాణి.. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇంటి నాలుగు గోడలకు పరిమితమవుతున్నారు. నేను హాకీ ఆడాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు, నా తల్లిదండ్రులు, నా బంధువులు నాకు మద్దతు ఇవ్వలేదు. నా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడం.. అందునా అమ్మాయిలకు అస్సలు సాధ్యం కాదనుకునేవారు. అంతేకాకుండా, మా బంధువులు తరచూ మా నాన్నకు చెప్పేవారు.. 'హాకీ ఆడి ఏం చేస్తుంది? పొట్టి స్కర్ట్ ధరించి మైదానం చుట్టూ పరిగెత్తుతుంది. అలా చేయడం వలన మీ కుటుంబానికి ఎంత చెడ్డ పేరు.. ఒక్కసారి ఆలోచించు అని నాన్నను రెచ్చగొట్టేవారు.

ఇప్పుడు అదే వ్యక్తులు నన్ను అభినందిస్తున్నారు అని రాణి గర్వంగా చెబుతోంది.

2. దీప్ గ్రేస్ ఎక్కా



దీప్ గ్రేస్ ఎక్కా ఒడిషాలోని సుందర్‌గఢ్ జిల్లా లుల్కిధి గ్రామానికి చెందిన అమ్మాయి. దీప్ కుటుంబంలో అందరూ హాకీ ఆటగాళ్లే. ఆమె తండ్రి, మామ, అన్నయ్య స్థానిక ఆటగాళ్లు. అయినప్పటికీ, దీప్ చిన్నప్పుడు హాకీ స్టిక్ పట్టుకుంటే.. అమ్మాయిలకు ఆటలేమిటి.. ఇంటి పని, వంట పని నేర్చుకోక అని ఇరుగు పొరుగువారు, గ్రామస్తులు తీవ్రంగా విమర్శించేవారు.

కానీ నేను వారి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు.. నా ఆట నేను ఆడుకునేదాన్ని. అందుకే ఇక్కడి వరకు వచ్చాను అని దీప్ సంతోషంగా చెబుతోంది. 16 ఏళ్ళ వయసులో, దీప్ సీనియర్ జట్టుతో పోటీ పడింది. ఆమె ప్రతిభను గుర్తించి వెంటనే, దీప్‌ను ఇండియా జూనియర్ జట్టుకు పిలిచారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఆమె జూనియర్ వరల్డ్ కప్‌తో పాటు 2014 ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది.

3. సుశీల చాను



మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన 29 ఏళ్ల సుశీల చాను జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలు. తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి. మామ నుండి సుశీలకు చాలా ప్రోత్సాహం లభించేది. 11 సంవత్సరాల వయస్సు నుంచి హాకీ ఆడటం ప్రారంభించింది. 2002 లో మణిపూర్‌లోని పోస్టీరియర్ హాకీ అకాడమీలో ఆమె తన పేరును నమోదు చేసుకుంది. అయితే, ఆమె రాష్ట్ర జట్టులో ఎంపిక కాకపోవడంతో దాదాపు ఆట నుంచి విరమించుకున్నాననుకుంది.

కానీ సీనియర్ ఆటగాళ్లు తిరిగి రమ్మని కోరారు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. చాను 2010 నుండి సెంట్రల్ రైల్వేలో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేస్తోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఆమెకు ఈ ఉద్యోగం వచ్చింది.

4. వందన కటారియా



ఉత్తరాఖండ్‌లోని రోష్‌నాబాద్ గ్రామానికి చెందిన వందన కటారియా చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు, హాకీ ఆడుతుంటే.. అమ్మాయిలకు ఈ ఆటలేమిటి అనే విమర్శలే ఎక్కువ వినిపించేవి. అందుకే ఊరికి దూరంగా, ఊరి పెద్దల కళ్లకు కనబడకుండా ఒక రహస్య ప్రదేశంలో ఆమె హాకీ ఆటను ప్రాక్టీస్ చేసేది. కానీ తాను ఆడుతున్నానని తెలిసిన

ప్రతి ఒక్కరూ క్రీడను విరమించుకోవాలని ఒత్తిడి చేసేవారు. అయితే వందన తండ్రి నహర్ సింగ్ కటారియా రెజ్లర్‌గా ఉండడంతో ఆమెను ఆటలవైపు ప్రోత్సహించేవాడు.

టోక్యో ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందు, వందన తండ్రి మరణించాడు. కానీ శిక్షణ కారణంగా ఆమె తండ్రి చివరి చూపుకు నోచుకోలేకపోయింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, 31 జూలై 2021 న, ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.

5. గుర్జిత్ కౌర్



డ్రాగ్ ఫ్లికర్ గుర్జిత్ కౌర్ అమృత్‌సర్‌లోని మియాది కలాన్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. వాళ్లది ఓ చిన్న గ్రామం కావడంతో హాకీ ఆట గురించి అస్సలు తెలియదు.

కానీ చదువుకునేందుకు 70 కి.మీ దూరంలో ఉన్న బోర్డింగ్ పాఠశాలకు వెళ్లినప్పుడు మాత్రమే ఆమెకు మొదట హాకీ పరిచయం అయ్యింది. గుర్జిత్‌కి ఆట గురించి ఏమీ తెలియక పోవడంతో రోజంతా హాకీ ఆడుతున్న అమ్మాయిలను చూస్తూ గడిపేది. ఇదే ఆమె ఆటలో రాణించాలని కోరుకునేలా చేసింది. హాకీ ఆట ఆమె అభిరుచిగా మారింది.

ప్రపంచ నంబర్ 4 తో జరిగిన ఒలింపిక్స్ క్వార్టర్-ఫైనల్‌లో, గుర్జిత్ 22 వ నిమిషంలో భారతదేశం యొక్క ఏకైక పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మార్చింది. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, "సంవత్సరాల శ్రమ ఫలించింది" అని గుర్జిత్ సంతోషం వ్యక్తం చేసింది.

6. సవితా పునియా



గోల్‌కీపర్ సవితా పునియా వీరత్వమే ఆస్ట్రేలియాను 1-0తో ఓడించి, భారత్‌ను మొట్టమొదటి ఒలింపిక్స్ సెమీ ఫైనల్‌కు చేర్చింది.

చిన్నప్పుడు సవిత తన హాకీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి 30 కి.మీ.కి నడిచి వెళ్లేది. ప్రతి వారం తన గ్రామం (జోధ్‌కాన్) నుండి సిర్సాలోని మహారాజా అగ్రసైన్ బాలికల సీనియర్ సెకండరీ పాఠశాలకు ఆరు సార్లు ప్రయాణించేది. హాకీ కోచ్‌లు, శిక్షణా సదుపాయాలు ఉన్న ఏకైక ప్రదేశం ఈ పాఠశాల.

సవితకు ముందు, ఆమె కుటుంబంలో ఎవరూ ఏ క్రీడను కెరీర్‌గా తీసుకోలేదు. ఆమె తాత, దివంగత రంజీత్ పునియా సవితను ప్రోత్సహించేవాడు.

7. లాల్రెంసియామి



మిజోరామ్‌కు చెందిన టీనేజ్ వయస్సులో ఉన్న ఈ అమ్మాయి ఇప్పటికే మైదానంలో, వెలుపల తనదైన ముద్ర వేసింది. "భారతదేశ ఒలింపిక్ జట్టులో ఎంపిక కావడం నా దివంగత తండ్రి కల" అని 21 ఏళ్ల లాల్రెంసియామి చెబుతుంది. ఎఫ్ఐహెచ్ రైజింగ్ స్టార్ అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.

వ్యవసాయం ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నప్పటికీ, లాల్రేమ్‌యామి తండ్రి ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా హాకీ కలలను కొనసాగించమని నిరంతరం ప్రోత్సహించేవాడు.

నిజానికి, లాల్రెంసియామి జట్టులో చేరినప్పుడు, ఆమె ఇంగ్లీష్‌కానీ, హిందీకానీ మాట్లాడడం రాదు. కానీ ఆమె సహచరులు ఆమెకు భాష నేర్చుకోవడంలో సహాయం చేశారు. పుస్తకాలు చదవడం ద్వారా మరికొంత నేర్చుకుని రెండు భాషల్లో పట్టు సాధించింది. భాష రాకముందు చేతి సంజ్ఞలతో తన సహచరులతో కమ్యూనికేట్ చేయాల్సి వచ్చేది.

8. సలీమా టేట్



సలీమా టేట్ రాష్ట్రంలోని నక్సలిజం ప్రభావిత జిల్లాలలో ఒకటైన జార్క్డ్ సిమ్‌దేగాలోని బద్కిచాపర్ గ్రామానికి చెందినది.

ఈ గ్రామంలో ఒక మురికి మైదానంలో ఒక రైతు కూతురు సలీమా హాకీలో మొదటి అడుగులు వేసింది. సబ్సిడీ బియ్యంతో వండిన అన్నం తింటూ పెరిగిన ఆమెకు ఇంక హాకీ స్టిక్‌లను కొనే స్థోమత ఎక్కడిది. అందుకే చెక్క కర్రలను ఉపయోగించి ఆడుకునేది. అయితే గ్రామంలో సౌకర్యాలు లేనప్పటికీ, అందరూ హాకీ ఆడతారు. హాకీ మాకు ఒక లక్ష్యాన్ని అందించింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రీడాకారిణిని నేను"అని 19 ఏళ్ల సలీమా ఆనందంతో చెబుతుంది.

Tags

Read MoreRead Less
Next Story