India-A vs Bangladesh-A: భారత్‌ ఘన విజయం, ఫైనల్‌లో పాక్‌తో పోరు

India-A vs Bangladesh-A: భారత్‌ ఘన విజయం, ఫైనల్‌లో పాక్‌తో పోరు
భారత్-పాక్ మధ్య పైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

ACC Cricket: ఏసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెట్(Acc Men's Emerging Cup) కప్‌లో భారత-ఏ యువ జట్టుకు ఎదురే లేకుండా పోతోంది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ని 51 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో ఆదివారం జరగనున్న ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan)ని మళ్లీ ఢీకొననుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు కెప్టెన్ యశ్ ధుల్(66, 6x4) రాణించడంతో 211 పరుగులైనా చేయగలిగింది. తర్వాత ఆఫ్ స్పిన్నర్ నిషాత్ సింధు(Nishanth Sindhu) 5 వికెట్లు తీసి అదరగొట్టడంతో బంగ్లాదేశ్ అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. గెలిచే స్థితిలో నుంచి భారత బౌలర్లు, అద్భుత ఫీల్డింగ్‌తో 66 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయింది.


212 స్వల్ప పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా ఓపెనర్లు షేక్, తాంజిద్‌లు ధాటిగా ఆడారు. 5వ ఓవర్ల దాకా 7 రన్‌ రేట్‌తో ఆడారు. బౌండరీలతో స్కోర్‌బోర్డ్ పరిగెత్తించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. 13వ ఓవర్లో బౌలింగ్‌కి వచ్చిన మానవ్ సుథార్(Manav Suthar) 4వ బంతికి షేక్‌ని బౌల్డ్ చేసి ప్రమాదకరంగా మారిన వీరి జోడిని విడగొట్టాడు. మరో ఓపెనర్ తాంజిద్ జోరును తగ్గించకుండా ఆడుతూ 53 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. బంగ్లా గెలుస్తుందనే అనుకున్నారంతా.

కానీ 18వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ నిషాత్ సింధు తన తొలి ఓవర్‌లో 3వ బంతికే తాంజిద్‌ని, ఫీల్డర్ నికిన్ ముందుకు దూకుతూ అద్భుతంగా పట్టిన క్యాచ్‌తో వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్ల ధాటికి నిలవలేకపోయారు. తర్వాతి ఓవర్లోనే సుథార్ మరో వికెట్ తీశాడు.

సైఫ్ హసన్, జాయ్‌లు బౌండరీలతో ఒత్తిడి పెంచారు. 25వ ఓవర్లో అభిషేక్ సైఫ్ హసన్‌ని 4వ వికెట్‌గా వెనక్కి పంపాడు. సౌమ్య సర్కార్ నికీ పంపిన అద్భుత క్యాచ్‌కి 5వ వికెట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా మరో 30 పరుగులు మాత్రమే చేసి చివరి 5 వికెట్లను కోల్పోవడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.


మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 9వ ఓవర్లోనే ఓపెనర్ సాయిసుదర్శన్ వికెట్ కోల్పోయింది. అభిషేక్, జోస్‌లు అడపా దడపా బౌండరీలో ఆడారు. 19వ ఓవర్లో జోస్ ఔటయ్యాడు. తర్వాత మరో 3 వికెట్లను స్వల్ప స్కోర్ల వ్యవధిలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. వికెట్లు పడుతున్నా, మిగిలిన బ్యాట్స్‌మెన్లతో కలిసి కెప్టెన్ యశ్‌ధుల్ భాగస్వామ్యాలు నెలకొల్పుతూ 200 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50వ ఓవర్లో 211 పరుగుల వద్ద చివరి వికెట్‌గా వెనుదిరగడంతో ఆలౌటయింది.


Tags

Read MoreRead Less
Next Story