1983 WorldCup: చరిత్రలో భారత ఆధిపత్యం మొదలైంది ఈరోజే..

1983 WorldCup: చరిత్రలో భారత ఆధిపత్యం మొదలైంది ఈరోజే..
కపిల్ సారథ్యంలో అద్భుతమైన నైపుణ్యాలతో కూడిన ఆటగాళ్లు తమ ఆటతో ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు

40 యేళ్ల క్రితం ఇదే రోజు భారత క్రికెట్ చరిత్రలో ఆ క్షణం మరచిపోలేని ఘట్టంగా నమోదైంది. భారత్‌లో క్రికెట్ ఒక మతంలా మారడానికి ఊపిరిపోసిన సందర్భం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌కు భారత్ కేంద్రబిందువు కావడానికి ఆ మ్యాచ్‌ పునాది వేసింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ బాల్కనీలో, చిరుదరహాసంతో భారత కెప్టెన్ కపిల్‌దేవ్ వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంటున్న క్షణాలు భారత క్రీడారంగంలో ఓ నూతన శకానికి నాంది పలికాయి.


40 యేళ్ల క్రితం ఈరోజున, అంటే 1983 జూన్ 25న, కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు, క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని అరివీర భయంకరమైన అప్పటి వెస్ట్‌ఇండీస్ జట్టుని మట్టికరిపించి మొట్టమొదటి సారిగా వరల్డ్ కప్‌ సాధించింది.

ట్రోఫీపై ఏ ఆశలు లేకుండానే, గ్రూప్‌ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా గొప్పే అని అనుకున్నారు ఆటగాళ్లు, అభిమానులు, ప్రత్యర్థులు. భారత ఆటగాళ్లు కూడా ఏదో హాలిడే ట్రిప్‌కి వెళ్లిరావచ్చనే భావనతో ఉన్నారు. అటునుంచి అటే అమెరికా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన భారత ఓపెనర్ శ్రీకాంత్, హనీమూన్‌ ట్రిప్‌కి కూడా ప్లాన్ చేసుకున్నాడు.

కానీ కపిల్ దేవ్ సారథ్యంలో అద్భుతమైన నైపుణ్యాలతో కూడిన ఆటగాళ్లు తమ ఆటతో ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు.

ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 60 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటయింది. భారత ఆటగాళ్లలో క్రిష్ణమాచార్య శ్రీకాంత్, మొహిందర్ అమర్‌నాథ్‌లు వరుసగా 38, 26 పరుగులు చేశారు. వెస్టిండీస్‌ గెలిచి, ట్రోఫీ ఎత్తడం ఖాయం అనుకున్నారు అంతా. అప్పటి మేటి బ్యాట్స్‌మెన్ వివ్ రిచర్డ్స్‌ని అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌తో కపిల్ దేవ్ పెవిలియన్‌కు పంపడంతో భారత శిబిరంలో ఆశలురేగాయి. అనంతరం భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో భారత్ 43 పరుగులతో విజయఢంకా మోగించి, నూతన శకానికి నాంది పలికింది.

కపిల్‌దేవ్ తప్ప ఎవరూ నమ్మలేదు..

ఆ విజయంపై మాజీ ఆల్‌ రౌండర్ కీర్తి ఆజాద్‌ మాట్లాడుతూ.. "టోర్నీ ప్రారంభానికి ముందు కపిల్‌దేవ్ తన బ్యాగ్‌లో షాంపేన్ బాటిల్ ఉంచుకున్నాడు. అతను మద్యపానం తాగడు. నాకివ్వు అది, నువ్వేం చేసుకుంటావు అని అడిగేవాడిని. కానీ ఫైనల్‌లో గెలిచిన తర్వాత లార్డ్స్ బాల్కనీలో కపిల్ మొదట ఓపెన్‌ చేసింది ఆ బాటిలే. గెలుస్తామని అతనొక్కడే నమ్మాడు" అని ఆనాటి క్షణాల్ని గుర్తుచేసుకున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story