Asia Cup 2023: నేడే భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరం

Asia Cup 2023:  నేడే భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరం
వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యే అవకాశం?

ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ఆసియాకప్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో నేడు భారత్‌- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత దాయాది జట్లు వన్డేల్లో అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు 90 శాతం వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆసియాకప్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. చివరగా గత వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఢీకొనగా ఆ తర్వాత ఇరుజట్ల మధ్య వన్డే మ్యాచ్‌ ఆడే అవకాశమే రాలేదు. టీ20ల్లో కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగి పది నెలలైంది. సుదీర్ఘ విరామం తర్వాత దాయాది జట్లు సమరానికి సిద్ధం కావడంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అన్ని అనుకూలిస్తే ఈ టోర్నీలో భారత్‌-పాక్‌ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఆసియా కప్‌పై ఆసక్తి అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు వరుణుడు సిద్ధమయ్యాడు. శనివారం కాండీలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని సమాచారం. వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉందనీ... వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని శ్రీలంక వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా అన్న అనుమానం నెలకొంది.


భారత్‌- పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేకుంటే కోహ్లీ-రవూఫ్, బుమ్రా-బాబార్ ఆజమ్ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. బుమ్రా, షమీ, సిరాజ్‌తో కూడిన భారత పేస్‌ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. అటు షాహీన్ అఫ్రిదీ, నసీమ్‌ షా, హరిస్ రవూఫ్‌తో కూడిన పాకిస్థాన్ బౌలింగ్ భీకరంగా ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌ శర్మ, శుభమన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీతో భారత టాప్‌ఆర్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తోంది. KL రాహుల్‌ గైర్హాజరీలో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు ఇషాన్‌ కిషన్‌ లేదా సంజూ శాంసన్‌కు దక్కే అవకాశం ఉంది. మిడిల్‌ఆర్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల బాధ్యతను నిర్వర్తించనున్నారు.

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఏడు సార్లు భారత్‌, అయిదుసార్లు పాక్‌ గెలిచాయి. 2018లో తలపడ్డ రెండుసార్లూ టీమ్‌ఇండియానే పైచేయి సాధించింది. పాక్‌తో గత అయిదు ఆసియాకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ నాలుగు సార్లు నెగ్గడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story