India vs Pakistan: ఒక్కో టికెట్‌ ధర అర కోటి

India vs Pakistan: ఒక్కో టికెట్‌ ధర అర కోటి
కళ్లు తిరిగేలా ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ ధరలు... ధర చూస్తే మతి పోవాల్సిందే అంటున్న అభిమానులు...

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు దానిని మ్యాచ్‌లా కాకుండా యుద్ధంలా చూస్తారు. మైదానంలో ఆట‌గాళ్ల క‌వ్వింపులు, ఉద్వేగ‌పూరిత క్షణాలు మ్యాచ్‌ను ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. ICC ఈవెంట్‌లలో మాత్రమే ఎప్పుడో ఓసారి తలపడే దాయాదుల పోరును చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో దాయాదుల పోరును ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది. కానీ భారత్‌-పాక్‌ను ప్రత్యక్షంగా చూడాలంటే మీ దగ్గర కనీసం లక్షల రూపాయలు ఉండాల్సిందే. ఎందుకంటే టికెట్‌ రేట్లు అలా ఉన్నాయ్‌ మరి


వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించే అభిమానులకు షాక్‌ తగిలేలా టికెట్ల ధరలు ఉన్నాయి. సెకండరీ మార్కెట్‌లో ఉన్న ఈ టికెట్ ధరలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా దాయాదుల మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఆగస్టు 29, సెప్టెంబర్ 3న అధికారికంగా టికెట్ల విక్రయాలు నిర్వహించగా.. గంట వ్యవధిలోనే సోల్డ్‌ ఔట్ బోర్డులు దర్శనమివ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో సెకండరీ మార్కెట్‌లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.


సౌత్‌ ప్రీమియమ్‌ వెస్ట్ బే టికెట్‌ రేటు 19.5 లక్షలు కాగా.. అప్పర్‌ టైర్‌లోని రెండు టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా స్పోర్ట్స్‌ టికెట్ల ఎక్ఛ్సేంజ్, రీసేల్‌ వెబ్‌సైట్‌ ‘వయాగోగో'లో చూపిస్తోంది. అయితే, ఒక్కో టికెట్‌ ధర 57 లక్షలు ఉండటంతో అంతా నోరెళ్లబెడుతున్నారు. టీమిండియా ఆడనున్న మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు కూడా సెకండరీ మార్కెట్‌లో భారీగా ఉన్నాయి. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఐసీసీ, బీసీసీఐలను ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెట్టారు.


ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్‌ ప్రపంచ కప్‌ జర్నీని ప్రారంభించనుంది. 12 ఏళ్ల తర్వాత భారత్‌ వన్డే వరల్డ్‌కప్‌నకు అతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ప్రిలిమనరీ జట్లను ప్రకటించాయి.టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ తదితర పది జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story